హాట్ టాపిక్... హెజ్ బుల్లా పేజర్లలా మొబైల్ ఫోన్లు పేల్చవచ్చా..?

ఇదే సమయంలో బ్యాటరీలు మాత్రమే వేడెక్కి పేలితే ఇంత భారీ గాయాలు కావని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు.

Update: 2024-09-18 17:30 GMT

లెబనాన్ లోని హెజ్ బొల్లా మిలిటెంట్ సంస్థకు చెందిన వందలాది పేజర్లు ఒకేసారి పేలడం అనే విషయం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇది పూర్తిగా ఇజ్రాయేల్ నిఘా సంస్థల పనే అని హెజ్ బుల్లా అనుమానిస్తోంది. ఇదే సమయంలో బ్యాటరీలు మాత్రమే వేడెక్కి పేలితే ఇంత భారీ గాయాలు కావని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు.

ఈ మేరకు పేజర్లలో మిలటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలు అమర్చినట్లు సైనిక నిపుణులు చెబుతున్నారు. తైవాన్ కు చెందిన ఓ సంస్థ తయారుచేసిన ఈ పరికరాలను తయారీ సమయంలో కానీ, ట్రాన్స్ పోర్టేషన్ సమయంలో కానీ మొస్సాద్ ఈ పనికి పూనుకుని ఉండోచ్చని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే... ఇప్పుడు సరికొత్త సందేహాలు తెరపైకి వస్తున్నాయి.

అవును... సింపుల్ నెట్ వర్క్, లిథియం బ్యాటరీలు ఉండే పేజర్లతోనే ఇంత విధ్వంసం జరిగినప్పుడు.. పవర్ ఫుల్ లిథియం బ్యాటరీతో పాటు 5జీ నెట్ వర్క్, జీపీఎస్ ట్రాకర్, గూగుల్ మ్యాప్ మొదలైన వాటితో నిండి ఉండే మొబైల్ ఫోన్ ను ఉగ్రవాదులు టార్గెట్ చేస్తే ఏమి జరుగుతోంది..? అదే జరిగితే ఆ నష్టాన్ని అంచనా వేయగలమా..? ఇప్పుడు ఇదే చర్చ మొదలైంది!

సెప్టెంబర్ 17 మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఒకేసారి 3000 పేజర్లు దాదాపు ఒకేసారి పేలాయి! హిజ్ బుల్లా కు బలమైన కోటగా చెప్పుకునే బీరూట్ దక్షిణ శివారులో ఈ పేలుళ్లు మొదలయ్యాయి. ఈ పేలుళ్లతో వందలాదిమంది గాయపడ్డారు. వీటిలో శక్తివంతమైన పెంటాఎరిత్రటాల్ ట్రైనైట్రేట్ (పీఈటీఎస్) అనే పేలుడు పదార్థాన్ని వాడే అవకాశం ఉందని అంటున్నారు.

అయితే ఈ పేలుళ్లకు కారణం పేజర్ లలోని బ్యాటరీలకు కొన్ని ట్విక్ లు చేసినట్లు భావిస్తున్నారు. ఈ మార్పుల కారణంగా బ్యాటరీ తక్షణమే వేడెక్కి, పేలుడు పదార్థాలను ప్రేరేపించిందని చెబుతున్నారు. ప్రధానంగా.. లెబనీస్ రేడియో నెట్ వర్క్ ను హ్యాక్ చేయడం ద్వారా పేజర్ లకు సిగ్నల్ పంపబడిందని ఫలితంగా పేలుళ్లు సంభవించాయనే ఊహాగాణాలు తెరపైకి వస్తున్నాయి.

ఇలా పేజర్లతోనే ఇంత చేయగలిగినప్పుడు.. సెల్ ఫోన్లు, హెడ్ ఫోన్ లు, ఎయిర్ పాడ్ లు, ల్యాప్ టాప్ లు, ఫేస్ మేకర్ లు వంటి ఇతర పరికరాల పరిస్థితి ఏమిటి అనే చర్చ తెరపైకి వచ్చింది. ఇలాంటి పరికరాలు కూడా దాడులకు గురి అవుతాయా అనే భయాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో నిపుణులు ఈ కొత్త ఆందోళనలను తోసిపుచ్చుతున్నారు!

ఇందులో భాగంగా... కొన్ని సందర్భాల్లో లిథియం బ్యాటరీలు ప్రమాదకరమైన మంటలకు గురయ్యే అవకాశం ఉందని.. అయితే లెబనాన్ సంఘటనలో పాల్గొన్న పరికరాలు రిమోట్ గా పేలుళ్లను ప్రేరేపించడానికి మార్చబడ్డాయని నివేదించబడిందని అంటున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... పేలిన ఆ పేజర్లు హ్యాక్ చేయబడలేదని నొక్కి చెబుతున్నారు.

తాజాగా పేలిన పేజర్లు ఏమీ హ్యాక్ చేయబడలేదు.. వాటిపై సైబర్ అటాక్ జరగలేదు అనేది గమనించడం ముఖ్యమని.. వాటికి తయారీ సమయంలోనో, రవాణా చేయబడే సమయంలోనో కొన్ని మార్పులు చేయబడ్డాయని చెబుతున్నారు. అందువల్ల సెల్ఫ్ ఓన్ యూజర్లలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని అంటున్నారు. ఇదే సమయంలో.. బ్యాటరీ సంబంధిత ఘటనల ప్రమాదాన్ని తగ్గించడానికి వినియోగదారులు కొన్ని సూచనలు పాటించాలని చెబుతున్నారు.

ఇందులో భాగంగా... థర్డ్ పార్టీ ఆప్షన్ లకు బదులుగా అధికారిక ఛార్జర్ లను మాత్రమే ఉపయోగించడం మంచిదని.. తీవ్రమైన వేడి నుంచి పరికరాలను దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. బ్యాటరీ హెల్త్ ను అప్పుడప్పుడూ పర్యవేక్షించాలని చెబుతున్నారు. ఏ పరికరాన్ని పూర్తిగా ఫెయిల్యూర్ నుంచి నిరోధించలేనప్పటికీ చిన్న చిన్న జాగ్రత్తల వల్ల పెద్ద పెద్ద నష్టాలను నిరోధించవచ్చని అంటున్నారు.

Tags:    

Similar News