ఆదాయంలో కర్ణాటకను 'తల'దన్నిన తెలంగాణ..దేశంలోనే సెకండ్..మరి ఏపీ?
పదేళ్ల తెలంగాణ దేశానికే తల‘సిరి’గా నిలుస్తోంది.. ధనిక రాష్ట్రం అనే బిరుదును సాకారం చేసుకుంటూ.. అద్భుత ప్రగతిని సాధిస్తోంది.
పదేళ్ల తెలంగాణ దేశానికే తల‘సిరి’గా నిలుస్తోంది.. ధనిక రాష్ట్రం అనే బిరుదును సాకారం చేసుకుంటూ.. అద్భుత ప్రగతిని సాధిస్తోంది. తలసరి ఆదాయంలో పెద్ద రాష్ట్రాలనే తలదన్నుతోంది. వరుసగా రెండో ఏడాది కూడా అత్యధక తలసరి ఆదాయంలో రెండో రాష్ట్రంగా నిలిచింది. తెలంగాణ కంటే ముందున్న రాష్ట్రం ఢిల్లీ మాత్రమే. దేశానికే రాజధాని అయిన ఢిల్లీకి కొన్ని ప్రత్యేకతలుంటాయి. దానిని కూడా మినహాయించి చూస్తే తెలంగాణ తలసరి ఆదాయంలో నంబర్ వన్ అనడంలో సందేహం లేదు.
పదేళ్లు.. దేశ జీడీపీకి ఎంతగానో మేళ్లు
తెలంగాణ ఏర్పాటైంది 2014. అంటే ఇప్పటికి పదేళ్లకు కొద్దిగా ఎక్కువన్నమాట. కానీ, దేశ తలసరి ఆదాయంలో రెండో స్థానానికి చేరింది. నిరుడు కూడా ఈ విషయంలో మెరుగైన పనితీరునే కనబర్చింది. ఇక భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి కూడా తెలంగాణ గణనీయమైన సహకారాన్ని అందిస్తోంది. ఇదేదో సర్వే సంస్థ చెబుతున్న మాటనో కాదు.. ఇటీవల ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి విడుదల చేసిన అధికారిక పత్రం. కాగా, దీనిప్రకారం తెలంగాణ పర్ క్యాపిటా (తలసరి ఆదాయం) 193.6 శాతం. కేవలం ఢిల్లీ మాత్రమే 200 పైగా తలసరి ఆదాయం దాటింది. దేశ రాజధాని పర్ క్యాపిటా (250.8 శాతం) కావడం విశేషం. వాస్తవానికి 1991లో దక్షిణ భారత రాష్ట్రాలు జాతీయ సగటు కంటే తక్కువగా ఉండేవి. అయితే, ఐదు దక్షిణాది రాష్ట్రాలలో మూడు ఇప్పుడు టాప్-5 సంపన్న రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి దేశ జీడీపీలో దక్షిణాది రాష్ట్రాలు 30% వీటిదే. టెక్నాలజీలో కర్ణాటక, ఆటోమొబైల్ రంగంలో తమిళనాడు ప్రగతి వాటిని మెరుగైన పర్ క్యాపిటాలో నిలుపుతోంది. అయితే, వీటికంటే చాలా చిన్నదైన,కేవలం పదేళ్ల వయసున్న తెలంగాణ వీటిని మించడం గమనార్హం.
దక్షిణాది దమ్ము..
తలసరి ఆదాయంలో తెలంగాణ తర్వాత మూడోస్థానంలో ఉంది దక్షిణాది రాష్ట్రం కర్ణాటక. దేశానికి ఐటీ రాజధానిగా పేరుగాంచిన బెంగళూరు ఉన్న కర్ణాకట పర్ క్యాపిటా (180.7 శాతం). హరియాణా (176.8 శాతం), తమిళనాడు (171.1 శాతం) వరుసగా 4, 5 స్థానాల్లో నిలిచాయి. మొత్తంగా చూస్తే ఈ విషయంలో మూడు దక్షిణాది రాష్ట్రాలు దేశంలో టాప్-5లో ఉన్నాయి. బిహార్ (32.8%), జార్ఖండ్ (57.2%), ఉత్తరప్రదేశ్ (50.8%), మణిపూర్ (66%), అస్సాం (73.7%) పేద రాష్ట్రాలుగా మిగిలాయి.
ఏపీని దెబ్బకొట్టిన రాజధాని
ఏపీ జీడీపీ పరంగా దేశంలో 9వ స్థానంలో ఉంది. తలసరి ఆదాయంలో 16వ స్థానంలో నిలుస్తోంది. దీనికి ప్రధాన కారణం.. హైదరాబాద్ వంటి ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే రాజధాని ఏపీకి లేకపోవడమేనని ఆర్థిక నిపుణునలు అభిప్రాయపడుతున్నారు. అయితే, దేశ జీడీపీకి దోహదకారుల్లో పెద్ద రాష్ట్రమేనని పేర్కొంటున్నారు.