'ఎన్-కన్వెషన్ – రేవంత్ రెడ్డి.. మధ్యలో 400 కోట్లు'... ఏమిటీ రచ్చ?
ఈ వ్యవహారంపై ముందుగా ఎక్స్ లో స్పందించిన ఆయన... ఎన్-కన్వెషన్ కూల్చివేత చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.
గత నెలాఖరులో హైదరాబాద్ లోని మాదాపూర్ వంటి ప్రైమ్ ఏరియాలో సినీనటుడు నాగార్జునకు సంబంధించిన "ఎన్-కన్వెషన్"ను హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే. తమ్మిడికుంట చెరువు ఎఫ్.టీ.ఎల్. జోన్ ను ఆక్రమించి ఈ నిర్మాణం చేపట్టారని ఆరోపిస్తూ హైడ్రా ఈ నిర్మాణాలను కూల్చివేసింది. దీంతో... ఈ వ్యవహారంపై నాగార్జున కోర్టును ఆశ్రయించారు.
ఈ వ్యవహారంపై ముందుగా ఎక్స్ లో స్పందించిన ఆయన... ఎన్-కన్వెషన్ కూల్చివేత చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. మరోపక్క ఎన్-కన్వెషన్ యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. దీంతో... తక్షణమే ఈ కూల్చివేతలు నిలిపివేయాలంటూ తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మద్యంతర ఉత్తర్వ్యులిచ్చింది!
అయితే అప్పటికే జరగాల్సిన పని జరిగిపోయిందనే సంగతి కాసేపు పక్కనపెడితే.. ఈ వ్యవహారం ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది! ఇదే విషయాలపై మరింత స్పందించిన నాగార్జున... ఈ చెరువు ఆక్రమణకు గురికాలేదంటూ ప్రత్యేక న్యాయస్థానం, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 24-02-2014న ఓ ఆర్డర్ ఎస్.ఆర్.3943/2011 ద్వారా జడ్జిమెంట్ ఇచ్చిందని తెలిపారు.
ప్రస్తుతం నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణాధికారం కోసం హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా... న్యాయస్థానం తీర్పుకు కట్టుబడి ఉంటామని చెబుతూ అవస్తవాలు నమ్మవద్దని అభిమానులకు, ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే... ఎన్-కన్వెషన్ సెంటర్ కూల్చివేతకు కారణం వేరే ఉందంటూ బీఆరెస్స్ నేత బాల్క సుమన్ మైకులముందుకు వచ్చారు.
అవును... ఎన్-కన్వెషన్ వ్యవహారంపై బీఆరెస్స్ నేత బాల్క సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... తమ్మిడికుంట ఎఫ్.టీ.ఎల్. పరిధిలో ఉన్న ఎన్-కన్వెషన్ విషయంలో నాగార్జునను రేవంత్ రెడ్డి రూ.400 కోట్లు డిమాండ్ చేశారనే ప్రచారం నడుస్తుందని.. అయితే నాగార్జున ఆ మొత్తం ఇవ్వనందుకే కన్వెషన్ ను కూల్చివేశారంటూ ఆరోపించారు.
ఇదే సమయంలో... హిమాయత్ సాగర్ లో నిర్మించిన ఆనంద్ కన్వెషన్ ను ఎందుకు కూల్చలేదని బాల్క సుమన్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఆనంద కన్వెషన్ యజమానులు రేవంత్ రెడ్డి సోదరులకు ముడుపులు చెల్లించారని.. అందువల్లే ఆనంద కన్వెన్షన్ ను టచ్ చేయలేదని బాల్క సుమన్ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో... ఈ ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి!
వాస్తవానికి ఎన్-కన్వెషన్ కు అనుమతులు లేవనేది హైడ్రా చెబుతున్న మాట. 2014లోనే ఎన్ కన్వెషన్ నిర్మాణానికి వ్యతిరేకంగా జీ.హెచ్.ఎం.సీ నోటీసులు జారీ చేసిందనేది హైడ్రా వాదన! అయితే... అసలు తమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురికాలేదని ప్రత్యేక న్యాయస్థానం తీర్పు ఇచ్చిందని.. ఇది పట్టా భూమి అనేది ఎన్ కన్వెషన్ యాజమాన్యం వాదన!
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది! ఈ నిర్మాణం కూల్చివేతలు ఆపాలంటూ హైకోర్టు మద్యంతర ఉత్తర్వ్యులు ఇచ్చినప్పటి నుంచీ ఈ విషయంపై అటు హైడ్రా అధికారులు కానీ, అటు ఎన్ కన్వెషన్ యాజమాన్యం కానీ స్పందించడం లేదు! ఆ యాజమాన్యం కోర్టులో న్యాయపోరాటం చేస్తుందని అంటున్నారు.
అయితే.. వాస్తవాలు ఇలా ఉంటే... రూ.400 కోట్లు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారని, అందుకు నాగార్జున అంగీకరించలేదని, అందువల్లే ఎన్-కన్వెషన్ పై హైడ్రాను ప్రయోగించారంటూ బాల్కా సుమన్ చేస్తున్న ఆరోపణలపల్లో పసలేదని అంటున్నారు పరిశీలకులు. కోర్టు పరిధిలో ఉన్న వ్యవహారంపై ప్రచారం పేరు చెప్పి ఇలాంటి కామెంట్లు చేయడం వల్ల ప్రయోజనం శూన్యమని గ్రహించాలని సూచిస్తున్నారు.