నిరుద్యోగ టీచర్లకు శుభవార్త : మార్చిలో డీఎస్పీ నోటిఫికేషన్?

ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేసిన ఈ ఫైలుకు ఎప్పుడు మోక్షం లభిస్తుందా? అని అంతా ఎదురుచూస్తుండగా మంత్రి లోకేశ్ శుభవార్త చెప్పారు.

Update: 2025-01-31 22:30 GMT

ఏపీలో నిరుద్యోగ ఉపాధ్యాయులకు మంత్రి నారా లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఉపాధ్యాయ నియామక ప్రక్రియ ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇప్పటికే 16,347 పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేసిన ఈ ఫైలుకు ఎప్పుడు మోక్షం లభిస్తుందా? అని అంతా ఎదురుచూస్తుండగా మంత్రి లోకేశ్ శుభవార్త చెప్పారు.

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఇష్టోగోష్ఠిగా మాట్లాడిన మంత్రి లోకేశ్ డీఎస్పీ ప్రకటనపై స్పష్టత నిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో 80 శాతం టీచర్ పోస్టులను టీడీపీనే భర్తీ చేసిందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇక ప్రస్తుతం ఉపాధ్యాయ బదిలీల విషయంలో పారదర్శక విధానం పాటించేలా ‘బదిలీ చట్టం’ చేయనున్నట్లు వెల్లడించారు. విద్యా వ్యవస్థలో అనాలోచిత విధానాలకు తావు ఉండకూడదని మంత్రి వ్యాఖ్యానించారు.

అదేవిధంగా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ప్రతి శుక్రవారం విద్యాశాఖ కమిషనర్ అందుబాటులో ఉంటారని చెప్పారు. ఉపాధ్యాయ సంఘాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్న తమ ప్రభుత్వం మెరుగైన విద్యావ్యవస్థ కోసం పాటుపడుతుందని తెలిపారు.

గత ప్రభుత్వం రూ.3 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పెట్టిందని, తమ ప్రభుత్వం ఈ ఏడు నెలల్లోనే రూ.800 కోట్లు బకాయిలు చెల్లించామని వివరించారు. జగన్ బకాయిలపై వైసీపీ ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని తెలిపారు. జగన్ పెట్టిన అన్ని బకాయిలను చెల్లిస్తున్నామని వివరించారు. ప్రభుత్వ బడుల్లో డ్రాపౌట్స్ తగ్గించేందుకు ప్రత్యేక వ్యవస్థ తెస్తున్నామన్నారు.

Tags:    

Similar News