తెలంగాణలో సీఎం సహాయానికి షరతులు

Update: 2015-11-07 05:32 GMT
ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు ఓ వరం. పెద్ద రోగాల దెబ్బకు పేదోడి జేబుకు చిల్లిపడకుండా కాపాడే వరప్రదాయిని. ప్రాంతాలతో సంబంధం లేకుండా పరిచయమున్న రాజకీయ నేతనో లేదా ప్రజా ప్రతినిధినో ఆశ్రయిస్తే చాలు.. ఆసుపత్రిలో అయిన ఖర్చులో దాదాపు 60 నుంచి 70 శాతం చేతికందే అవకాశం ఉంటుంది. ఇదే చీఫ్‌ మినిష్టర్‌ రిలీఫ్‌ ఫండ్‌ ప్రధాన ఉద్దేశం. అయితే ఇప్పటిదాకా అధికార పార్టీ ప్రజాప్రతినిధినో లేక ఏదో ఒక పార్టీకి చెందిన పొలిటిషియన్‌ నో ఆశ్రయించి.. సామాన్యులు - మధ్యతరగతి వారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్ధిక సహాయం పొందేవారు.  ఇకపై తెలంగాణలో ఇలాంటి అవకాశం ఉండకపోవచ్చు. నిబంధనలు మార్చబోతుండడమే దీనికి కారణం. సొంత ఎమ్మెల్యే అంగీకారం.. లక్ష రూపాయల పరిమితి వంటి నిబంధనలు విధిస్తున్నట్లు సమాచారం.

ఇటీవల కొంతమంది అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాలకు చెందిన ప్రజలకు సంబంధించిన సీఎంఆర్‌ ఎఫ్‌ మొత్తాన్ని ఇతర నేతలు, ఇతర ప్రాంతాల ప్రజాప్రతినిధులు  ఇప్పించడంపై అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా, విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. మా ప్రాంతానికి చెందిన వ్యక్తికి మాకు తెలియకుండా నేరుగా మంత్రి, లేదా వేరే జిల్లా ప్రజాప్రతినిధులు ఇప్పించడం సరికాదని, దీనివల్ల తమ మనుగడే ప్రశ్నార్ధకంగా మారుతోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు వాపోయినట్టు సమాచారం. ఇక విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా సీఎంఆర్‌ ఎఫ్‌ మంజూరు విషయంలో ఆగ్రహంతో ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యేను నేనైప్పటికీ.. నాకు తెలియకుండా, నా ప్రమేయం లేకుండా, నేరుగా అధికార పార్టీ నేతనో లేక పొరుగు నియోజకవర్గ ఎమ్మెల్యేనో, లేక జిల్లా మంత్రినో కలిసి పని కానిచ్చుకుంటుండడంతో తమ పరిస్థితి ఇబ్బందికరంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి రావడంతో పరిష్కార మార్గం అన్వేషణలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు ప్రభుత్వం ఇప్పటికే లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ (ఎల్‌ వోసీ) ఇవ్వడాన్ని నిలిపేసింది. లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ అంటే.. వైద్యానికి ముందే అయ్యే ఖర్చులో కొంత భాగాన్ని చెల్లిస్తామని ఆస్పత్రులకు హామీ రూపంలో ఇవ్వడం. అయితే ఎల్‌ వోసీ పెద్దయెత్తున దుర్వినియోగమవుతోందని భావించిన సర్కారు, దీన్ని కొద్ది నెలల కిందట ఆపేసింది. అదేవిధంగా చీఫ్‌ మినిష్టర్‌ రిలీఫ్‌ ఫండ్‌ మంజూరు విషయంలో కూడా కొన్ని నియమనిబంధనలు పెట్టుకుంది. కానీ వాటిని ఎక్కడా అధికారంగా బయటకు వెల్లడించలేదు. సీఎంఆర్‌ ఎఫ్‌ కు దరఖాస్తు చేసే వారు ఎంత పెద్దమొత్తంలో ఆస్పత్రి బిల్లులను పెట్టుకున్నా.. లక్ష రూపాయలకు మించి ఇవ్వకూడదనే నియమాన్ని పెట్టుకుంది. మంత్రి రికమండేషన్‌ చేసినా సరే.. లక్ష రూపాయలకు మించి ఇవ్వడం లేదు. కొన్ని ప్రత్యేక కేసులు, పరిస్థితుల్లో తప్ప. ఇకపై ఏ ప్రాంతం వారైనా సరే.. సఎంఆర్‌ ఎఫ్‌ నుంచి ఆర్ధిక సహాయం పొందాలంటే స్థానిక ఎమ్మెల్యే ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర ప్రాంతాల నేతల సిఫారసు లేఖలు సమర్పించి ఆర్ధిక సహాయం పొందే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా తమ ప్రాంతానికి చెందని వారు ఎవరైనా సీఎంఆర్‌ ఎఫ్‌ ఆర్ధిక సహాయం కోసం వస్తే.. సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యేను సంప్రదించాలని చెబుతున్నారు. దీంతో కచ్చితంగా లోకల్‌ ఎమ్మెల్యేను ఆశ్రయించక తప్పని పరిస్థితి ఎదురవుతోంది.

..అయితే దీనివల్ల ఎమ్మెల్యేల ఇగో చల్లారుతున్నా కష్టాల్లో ఉన్నవారికి మాత్రం కొత్త కష్టాలు రానున్నాయి. తమ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినా పరిచయం లేకపోవచ్చు... రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు... సదరు ఎమ్మెల్యే తీరు బాగుండకపోవచ్చు.. ఇలా ఏ కారణం వల్లయినా ఆయన సహాయం చేయకపోవచ్చు. అలాంటప్పుడు ప్రజలు నష్టపోతారు. కాబట్టి సీఎం సహాయనిధికి లేనిపోని నిబంధనలు పెట్టి ప్రతిబంధకాలు సృష్టించకపోవడమే మంచిది.
Tags:    

Similar News