కాంగ్రెస్ పార్టీకి దుమ్మురేపే ఐడియా వ‌చ్చింది

Update: 2017-09-03 17:21 GMT
టీఆర్ ఎస్ సార‌థ్యంలోని తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఇటీవ‌లి కాలంలో ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్న ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మూస‌ప‌ద్ద‌తుల నుంచి మారుతోంది. టెక్నాలజీ ఆధారంగా ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియా కేంద్రంగా దాడి పెంచిన కాంగ్రెస్ పార్టీ ఇదే ఊపులో కొత్త కొత్త ఆలోచ‌న‌ల‌తో అధికార పార్టీని టార్గెట్ చేస్తోంది. అలాంటిదే తాజాగా ప్ర‌వేశ‌పెట్టి వినూత్న పోటీ.  అధికారులంతా నెల‌రోజుల పాటు శ్ర‌మించి న‌గ‌రంలో గుంత క‌న‌ప‌డకుండా చేయాల‌ని సీఎం కేసీఆర్ ఆర్డ‌ర్ వేసిన సంగ‌తి తెలిసిందే.

అయితే కేసీఆర్ ఆర్డ‌ర్ అలాగే ఉండిపోయింది. వ‌ర్షం కురిసిన సంద‌ర్భంగా రోడ్డు మ‌ట్టికొట్టుకుపోయి ఎన్నో చోట్ల గుంత‌లు ప‌డ్డాయి. ఈ క్ర‌మంలో ఎంద‌రో అవ‌స్థ‌లు ప‌డ్డారు. ప్ర‌జ‌ల ఆవేద‌న‌ను త‌మ పోరాట అజెండాలో భాగం చేయాల‌నుకున్న కాంగ్రెస్ పార్టీ ఇందులో క్రియాశీలంగా అడుగువేసింది. కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి త‌న‌యుడు - టీపీసీసీ కార్య‌ద‌ర్శి మ‌ర్రి ఆదిత్య‌రెడ్డి ఈ ఇక్క‌ట్ల‌ను క్రేజీగా ఉప‌యోగించుకొని ఓ పోటీ పెట్టారు. ప్ర‌జ‌ల‌కు అవార్డులు ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యారు.

ఇంత‌కీ ఆ పోటీ ఏంటంటే...హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలోని రోడ్ల‌పై ఎన్నో గుంత‌లు ప‌డి ఉన్న సంగ‌తి తెలిసిందే. వీటిని ఫొటో తీసి కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌కు ఈనెల 10వ తేదీలోగా ఈమెయిల్ చేయాలి. ఇలా వ‌చ్చిన వాటిల్లో అత్యంత ప్ర‌మాద‌క‌రంగా ఉన్న మొద‌టి రెంటికి బ‌హుమ‌తి అందించ‌నున్నారు. మొద‌టి బ‌హుమ‌తి కింద రూ.5వేలు - రెండో బ‌హుమ‌తి కింద రూ.2500 ఇవ్వ‌నున్నారు. భారీ వ‌ర్షాల‌కు హైద‌రాబాద్‌ లో రోడ్లు అధ్వానంగా తయార‌య్యాయ‌ని పేర్కొన్న ఆదిత్య‌రెడ్డి వీటిని బాగు చేసే విష‌యంలో ప్ర‌భుత్వం చ‌ర్య‌లు శూన్య‌మ‌ని మండిప‌డ్డారు. స‌ర్కారు పెద్ద‌ల్లో చ‌ల‌నం తెచ్చేందుకు తాము `గ‌తుకుల గుంత‌ల పోటీ`ని పెట్టిన‌ట్లు వివ‌రించారు.
Tags:    

Similar News