కొత్త గవర్నర్ వద్దకు టీ కాంగ్రెస్..మాజీ గవర్నర్ పై ఫిర్యాదు

Update: 2019-09-19 16:16 GMT
కొత్త రాష్ట్రం తెలంగాణలో గవర్నర్ మారగానే... రాజకీయం రంజుగా మారిపోయింది. మొన్నటిదాకా తెలంగాణకు గవర్నర్ గా వ్యవహరించిన ఈఎస్ఎల్ నరసింహన్ కు ఉద్వాసన పలికేసిన మోదీ సర్కారు... ఆయన స్థానంలో ఆయన రాష్ట్రం తమిళనాడుకే చెందిన బీజేపీ మహిళా నేత తమిళిసై సౌందరరాజన్ ను నియమించేసింది. ఈ మార్పుతో తెలంగాణలో విపక్షాలకు సరికొత్త బలం వచ్చేసిందన్న మాట బాగానే వినిపిస్తోంది. మొన్నటికి మొన్న తెలంగాణ బీజేపీ నేతలు తమిళిసై వద్దకు వెళ్లి సీఎం కేసీఆర్ పై ఫిర్యాదు చేస్తే... ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ కు వెళ్లి ఏకంగా పాత గవర్నర్ నరసింహన్ పైనే ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఫిర్యాదుల పట్ల కూడా తమిళిసై సానుకూలంగానే స్పందించారట.

మాజీ గవర్నర్ నరసింహన్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏమని ఫిర్యాదు చేశారన్న విషయానికి వస్తే... తెలంగాణ కొత్త రాష్ట్రంగా అవతరించాక తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్... పార్టీ ఫిరాయింపులను పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. ఆపరేషన్ ఆకర్ష్ పేరిట టీడీపీ - కాంగ్రెస్ లకు చెందిన చాలా మంది ఎమ్మెల్యేలను టీఆర్ ఎస్ లోకి లాగేశారు. ఈ మొత్తం వ్యవహారం కేసీఆర్ కేంద్రంగానే జరిగినా... ఆ తంతుకు గవర్నర్ హోదాలో ఉన్న నరసింహన్ వత్తాసు పలికారని - పార్టీ ఫిరాయింపులను నిరోధించాల్సిన గురుతర బాధ్యత కలిగి ఉన్న గవర్నర్.. ఫిరాయింపులను ప్రోత్సహించారని కూడా కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం టీ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క - టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిల నేతృత్వంలో రాజ్ భవన్ లో ప్రత్యక్షమైన కాంగ్రెస్ బృందం కొత్త గవర్నర్ తమిళిసైకి ఫిర్యాదు చేసింది.

మాజీ గవర్నర్ నరసింహన్ పై ఫిర్యాదు చేయడంతో పాటుగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస యాదవ్ - సబితా ఇంద్రారెడ్డిలకు కేసీఆర్ ఏకంగా మంత్రి పదవులు కట్టబెట్టారని కాంగ్రెస్ నేతలు తమిళిసైకి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తమ పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత టీఆర్ ఎస్ లోకి ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కూడా ఆ బృందం గవర్నర్ ను కోరింది. సుదీర్ఘంగానే కొనసాగిన బేటీ తర్వాత బయటకు వచ్చిన భట్టి మీడియాతో మాట్లాడుతూ... తమ ఫిర్యాదుపై పరిశీలన చేస్తామని గవర్నర్ హామీ ఇచ్చారని చెప్పారు. అంతేకకాకుండా తన స్పందన కూడా చాలా వేగంగానే ఉంటుందని కూడా తమిళిసై తమకు చెప్పారని భట్టి పేర్కొన్నారు. మొత్తంగా మాజీ గవర్నర్ పై కాంగ్రెస్ బృందం చేసిన ఫిర్యాదుపై కొత్త గవర్నర్ ఎలా స్పందిస్తారన్న విషయం ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News