గులాబీ బ్యాచ్ ను ఎలా ఆడుకోవాలో టీ కాంగ్రెసోళ్లకు చేతకావట్లేదా?

Update: 2021-07-09 16:30 GMT
కొన్నిసార్లు అనుకోని రీతిలో తప్పులు జరిగిపోతుంటాయి. లక్ష్యం ఒకటైతే.. అందుకు ఏ మాత్రం పొంతన లేని ఫలితాలు వచ్చి దిమ్మ తిరిగే షాక్ తగులుతుంటుంది. తాజాగా తెలంగాణ రాజకీయాల్ని చూసినప్పుడు ఇలాంటి భావనే కలుగుతుంది. ఎవరినో ఏదో టార్గెట్ చేద్దామన్న హడావుడిలో.. తమను తామే అనుకుంటున్న భావన కలిగేలా తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేస్తూ తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడా పార్టీలో కొత్త సందడి షురూ కాగా.. అధికార టీఆర్ఎస్ లో ఏదో తెలియని గుబులు మొదలైందన్నట్లుగా ఉంది.

ఆ మధ్య వరకు కాంగ్రెస్ చచ్చిన పాము అని వ్యాఖ్యానించిన టీఆర్ఎస్ నేతలు.. తాజాగా ఆ పార్టీని చూసి కూసింత బెరుకుగా ఫీల్ కావటం చూస్తే.. రేవంత్ నియామకంలో చోటు చేసుకున్న మార్పు ఇట్టే అర్థమవుతుంది. ఆరేడు నెలల క్రితం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీలో ఎలా అయితే హుషారు నెలకొందో.. ఇప్పుడు అలాంటి పరిస్థితే టీ కాంగ్రెస్ లో నెలకొందని చెప్పక తప్పదు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న లక్షణం ఏమంటే.. ఒకసారి పుంజుకుంటే దాన్ని నిలువరించటం సాధ్యం కాదు. అదే సమయంలో ఒక్క దెబ్బకే  కిందా మీదా పడిపోవటం కూడా ఆ పార్టీకే చెల్లుతుంది. అందుకే.. దెబ్బ మీద దెబ్బ కొడుతూ ఇంతకాలం కోలుకోకుండా చేసిన టీఆర్ఎస్ కు.. తొలిసారి అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది.

ఈ విషయం నిన్నటికి నిన్న మంత్రి కేటీఆర్ మాటల్లోనే కాదు.. ఈ రోజున మంత్రి హరీశ్ రావు చేసిన ఘాటు వ్యాఖ్యల్లోనూ తేడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కు చంద్రబాబుకు లింకు పెట్టే పని చేయని టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు మాత్రం అలా చేయటానికి ఆసక్తిని చూపించటం కనిపిస్తుంది. టీడీపీ ముఖం పెట్టుకొని వస్తే తెలంగాణ ప్రజలు రానివ్వరని కాంగ్రెస్ ను ఉద్దేశించిన హరీశ్.. తమ పార్టీలోకి తాజాగా వస్తున్న రమణ.. ఆయన్ను తీసుకొస్తున్న ఎర్రబెల్లి ఎక్కడి వారు? అన్నది ప్రశ్న.

తెలంగాణలో టీడీపీ అన్నది రాజకీయ నిషేధిత పార్టీగా ప్రజలు భావిస్తున్నారనే అనుకుందాం. ఒకవేళ టీడీపీకి చెందిన రేవంత్ కాంగ్రెస్ లోకి వెళ్లటం వెనుక చంద్రబాబు ఉండి ఉంటే.. టీఆర్ఎస్ లోకి రమణ వెళ్లటం వెనుక కూడా చంద్రబాబు ఉన్నారా? అంతెందుకు..రమణను గులాబీ కారు ఎక్కించే అంశాన్ని టేకప్ చేసి సక్సెస్ పుల్ గా టీడీపీకి రాజీనామా చేయించటంలో కీలక భూమిక పోషించిన ఎర్రబెల్లి కూడా చంద్రబాబు అనుంగ శిష్యుడే కదా? ఆయన్ను కూడా చంద్రబాబే వ్యూహాత్మకంగా పంపారన్న మాట ఎవరైనా అంటే.. అందుకు కేసీఆర్ అండ్ కో ఏమంటారు? 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని గెలవాలని ప్రయత్నం చేసినట్లుగా హరీశ్ ఆరోపిస్తున్నారు.
 ఆయన మాట నిజమే. ఒకవేళ హరీశ్ నోటి నుంచి ఆ మాట వస్తే.. 2009లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని అధికారంలోకి రావాలని ప్రయత్నించటం.. భంగపడటం తెలిసిందే. మరి.. దీనికి టీఆర్ఎస్ నేతలు ఏమంటారు? మనం ఒక వేలు చూపిస్తే.. నాలుగు వేళ్లు మనవైపు చూపిస్తాయన్న చిన్న విషయాన్ని హరీశ్ లాంటోళ్లు ఎందుకు మర్చిపోతున్నారు. ఈ రోజున రేవంత్ ను టార్గెట్ చేయటానికి చంద్రబాబును సీన్లోకి లాగిన కేటీఆర్.. హరీశ్ లు.. తమను కూడా ఎవరైనా లాగితే అందుకు ఏమని బదులిస్తారు? ఒకవేళ ఎవరూ లాగలేదనుకుందాం.. జనం పిచ్చోళ్లా? వారేం అనుకున్నా ఫర్లేదా?
Tags:    

Similar News