ఎయిర్ పోర్ట్ లో తెలంగాణ కాంగ్రెస్ నేతల రగడ

Update: 2015-10-19 17:59 GMT
పవర్ లో ఉన్నా.. లేకున్నా.. అధిపత్య పోరుతో రగిలిపోతూ.. అసంతృప్తితో నిండిన తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య రచ్చ ఏ స్థాయిలో ఉందన్న విషయం తాజాగా మరోసారి బజారుకెక్కింది. తామున్నది ఎయిర్ పోర్ట్ అని.. నలుగురి ముందు కోట్లాడుకోవటం పార్టీకి సిగ్గుచేటన్న విషయాన్ని మర్చిపోయి మరీ.. చిన్నపిల్లల మాదిరి అధిపత్యపోరు కోసం తగులాడేసుకున్నారు.

ఢిల్లీ నుంచి వచ్చిన అధిష్ఠానం దూత ముందే పంచాయితీ పెట్టేసుకున్నారు. మాజీ మంత్రి దానం నాగేందర్.. పరిగి ఎమ్మెల్యే రాం మోహన్ రెడ్డిలు ఇద్దరు తీవ్రస్థాయిలో తగులాడేసుకున్నారు. ఈ నేతల ఇద్దరి మధ్య సరిహద్దు సమస్యలతో పాటు.. పార్టీ అధిపత్య పోరు జోరుగా సాగుతున్న నేపథ్యంలో.. ఒకరి మీద ఒకరు అధిపత్యం వహించేందుకు బహిరంగంగా కోట్లాటకు కూడా సిద్ధమైన దుస్థితి.

నిజానికి ఈ ఇద్దరి నేతల మధ్య పంచాయితీ ఇప్పటిది కాదు. గత కొద్దికాలంగా సాగుతున్నదే. జీహెచ్ఎంసీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడైన దానం నాగేందర్.. రంగారెడ్డి జిల్లా అర్బన్ వ్యవహారాలు కూడా తన అధీనంలో ఉండాలని కోరుతున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

దానం నాయకత్వం తమకు ససేమిరా అంటున్న రంగారెడ్డి అర్బన్ కాంగ్రెస్ నాయకులు.. దానంను హైదరాబాద్ రెవెన్యూ జిల్లాలకు మాత్రమే అధ్యక్షుడిగా పరిమితం చేయటంలో సక్సెస్ అయ్యారు. అంతేకాదు.. తమ వాదనకు తగ్గట్లుగా అధినాయకత్వం నుంచి లిఖితపూర్వక ఆదేశాలు తెచ్చుకున్నారు. దీంతో రగిలిపోతున్న దానం.. తాజాగా నగరంలో అడుగు పెట్టిన డిగ్గీ రాజాను సమస్యలతో స్వాగతం పలికారు. డిగ్గీకి స్వాగతం చెప్పేందుకు దానం.. రాం మోహన్ రెడ్డిలు రావటం.. ఇరువురు ఒకరికొకరు ఎదురెదురు పడటంతో మాటా.. మాటా పెరిగి రచ్చ మొదలైంది.  ఈ సరిహద్దుల అసంతృప్తుల మాటేమిటో కానీ..ఇలా బాహాటంగా తిట్టేసుకోవటం పార్టీ పరపతిని తీవ్రంగా దెబ్బ తినేలా చేస్తుందని కాంగ్రెస్ నేతలు.. కార్యకర్తలు ఫీలైపోతున్నారు. కొందరు కాంగ్రెస్ నేతలకు ఎవరి ఫీలింగ్స్ పెద్దగా పట్టవేమో.
Tags:    

Similar News