బాబుతో పొత్తంటేనే జ‌డుస్తున్న టీ-కాంగ్రెస్

Update: 2018-12-19 07:42 GMT
తెలంగాణలో కాంగ్రెస్‌-టీడీపీ పొత్తు విక‌టించింది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వారి కూట‌మికి ప్ర‌జ‌లు ఘోర‌మైన ప‌రాజ‌యాన్ని చ‌విచూపించారు. దీంతో లోక్ స‌భ ఎన్నిక‌ల్లో టీడీపీతో క‌లిసి వెళ్ల‌డంపై టీ-కాంగ్రెస్ నేత‌లు పున‌రాలోచ‌న‌లో ప‌డ్డారు. చంద్ర‌బాబుతో పొత్తు లేకుంటేనే తాము మెరుగైన ఫ‌లితాలు సాధించ‌గ‌ల‌మ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. వెంట‌నే ఈ విష‌యాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాల‌ని యోచిస్తున్నారు.

తెలంగాణ‌లో దారుణ ఓట‌మి నుంచి కాంగ్రెస్ నేత‌లు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ప‌రాజ‌యానికి దారితీసిన ప‌రిస్థితుల‌ను విశ్లేషించుకుంటున్నారు. టీడీపీతో పొత్తు కొనసాగితే తెలంగాణలో కాంగ్రెస్‌ భవిష్యత్‌ ప్రశ్నార్థకమవుతుందని అభిప్రాయ‌ప‌డుతున్నారు. లోక్‌ సభ ఎన్నికల్లో ఆ పార్టీకి దూరంగా ఉండాల‌ని భావిస్తున్నారు. బాబుతో పొత్తు కొన‌సాగితే కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసేందుకు కూడా నాయకులు ముందుకు రాని పరిస్థితులు ఏర్పడతాయని అంచ‌నా వేస్తున్నారు.

టీపీసీసీ నేత‌ల మ‌నోగ‌తం ప్ర‌కారం.. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు 3 నెల‌ల ముందు వ‌ర‌కు గ్రామాల్లో టీఆర్ ఎస్ వైపే మొగ్గు ఉంది. కానీ- ప‌ట్ట‌ణ ప్రాంత ఓట‌ర్లు - యువ‌త - ఉద్యోగులు కాంగ్రెస్ మీద‌ సానుభూతితో ఉన్నారు. చంద్ర‌బాబు రంగ ప్ర‌వేశంతో ప‌రిస్థితి మారిపోయింది. రాష్ట్ర విభ‌జ‌న నాటి ప‌రిస్థితులు మ‌ళ్లీ వారి ముందు క‌ద‌లాయి. తెలంగాణ వాదం మ‌న‌సుల్ని తాకింది. కాంగ్రెస్ నేత‌ల కంటే చంద్ర‌బాబే ఎక్కువగా తెలంగాణ‌పై దృష్టిపెట్టిన‌ట్లు వారికి అనిపించింది. అందుకే కాంగ్రెస్ పై సానుభూతి మాయ‌మైంది. ఓట్ల‌న్నీ గంప‌గుత్త‌గా గులాబీ పార్టీకి మ‌ళ్లాయి.

టీడీపీని ప‌క్క‌న‌పెట్టి కేవ‌లం సీపీఐ - టీజేఎస్ పార్టీల‌తో కూట‌మి ఏర్పాటుచేసుకొని ఉంటే త‌మ‌కు క‌నీసం మ‌రో 20 సీట్లు ఎక్కువ‌గా వ‌చ్చి ఉండేవ‌ని కాంగ్రెస్ నేత‌లు విశ్లేషిస్తున్నారు. బాబుతో త‌మ‌ పొత్తు కార‌ణంగానే ఓట్ల‌న్నీ టీఆర్ ఎస్ వైపు మ‌ళ్లాయ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఏడాది లోక్ స‌భ ఎన్నిక‌ల్లో టీడీపీతో పొత్తు వ‌ద్ద‌ని అధిష్ఠానానికి విన్న‌వించాల‌ని మాజీ మంత్రి ర‌వీంద్ర నాయ‌క్‌ - ఎమ్మెల్సీ పొంగులేటి సుధాక‌ర్ రెడ్డి - మాజీ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి త‌దిత‌రులు యోచిస్తున్నారు.

Tags:    

Similar News