కాంగ్రెసోళ్ల‌కు ఎవ‌రిని మెచ్చుకోవాలో కూడా తెలీదా?

Update: 2016-04-15 08:57 GMT
రాజ‌కీయాల‌న్నాక ఎత్తులుజిత్తులు మామూలే. కానీ.. ఆ విష‌యాన్ని కావాల‌ని మ‌ర్చిపోతారో.. లేక కేసీఆర్ పాల‌న వారికి అలాంటి మాన‌సిక స్థితికి తీసుకొస్తుందో కానీ.. త‌ర‌చూ త‌ప్పులు చేస్తుంటారు. రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థులు చేసే మంచి ప‌నుల్ని మెచ్చుకునే మంచిరోజులు పోయి చాలాకాల‌మే అయ్యింది. దూకుడు రాజ‌కీయాలు షురూ అయ్యాక విలువ‌ల్ని వ‌దిలేసిన ప‌రిస్థితి.

తెలంగాణ అధికార‌ప‌క్షాన్ని చూస్తే వారు ఏ విష‌యంలో అయినా చాలా స్ప‌ష్ట‌త‌తో ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది. ఎంత మంచి ప‌ని చేసినా స‌రే.. ప్ర‌త్యర్థుల‌పై ప్ర‌శంస అన్న‌ది మాట వ‌ర‌స‌కు కూడా ఉండ‌దు. ఒక‌వేళ పొగ‌డాల‌నుకుంటే దానికో వ్యూహం ఉంటుంది.  తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల్లో ఇలాంటివి త‌ర‌చూ క‌నిపిస్తుంటాయి. విప‌క్ష కాంగ్రెస్ నేత‌ల్ని ఉద్దేశించి ఇద్ద‌రు ముగ్గుర్ని కేసీఆర్ అండ్ కో మెచ్చుకుంటూ క‌నిపిస్తుంది. ఈ మెచ్చుకోళ్లు కూడా వారు చేసిన ప‌నుల గురించి కాక‌.. వారి వ‌య‌సును.. అనుభ‌వాన్ని మాత్ర‌మేన‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

వ్య‌క్తిగ‌త ప్ర‌శంస‌ల‌కు ప‌డిపోయే తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు.. అధికార‌ప‌క్షంపై అంత ఎదురుదాడికి దిగ‌ని ప‌రిస్థితి. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ నేత‌లు తీరు మ‌రికాస్త విచిత్రంగా ఉంటుంది. కాంగ్రెస్ పాల‌న మొత్తాన్ని గంప‌గుత్తిగా తిట్టిపారేసే కేసీఆర్ అండ్ కోకు భిన్నంగా రెండేళ్ల కేసీఆర్ పాల‌నను కీర్తించ‌టం క‌నిపిస్తుంది. ఇక్క‌డ చెప్పేదేమంటే.. కాంగ్రెస్ త‌న పాల‌న మొత్తంలో ఒక్క‌టంటే ఒక్క‌మంచిప‌ని చేయ‌లేదా? అన్న‌ది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. కాంగ్రెస్ జ‌మానా మొత్తాన్ని తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టేసే కేసీఆర్‌.. ఒక్క విష‌యాన్ని కూడా మెచ్చుకున్న దాఖ‌లాలు క‌నిపించ‌దు. వైరిప‌క్షం ప‌ట్ల ఎంత క‌రుకుగా ఉండాల‌న్న దానికి ఇదో నిద‌ర్శ‌నం.

అదే స‌మ‌యంలో తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల తీరు ఇందుకు భిన్నంగా ఉంటుంది. కేసీఆర్ స‌ర్కారు తీసుకునే నిర్ణ‌యాల్లో కొన్నింటిని గురించి వారు పొగిడేస్తుంటారు. తెలంగాణ అధికార‌ప‌క్షానికి మించి ప్ర‌శంస‌లు చేస్తుంటారు. తాము మంచిత‌నంతో చేసే ప్ర‌శంస‌లు త‌మ‌కు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల్ని దెబ్బ తీస్తాయ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోతుంటారు. అసెంబ్లీలో ఆ మ‌ధ్య‌న కాంగ్రెస్ సీఎల్పీ నేత జానారెడ్డి మొద‌లు.. సీనియ‌ర్ కాంగ్రెస్ నేత కోమ‌టి రెడ్డి వెంక‌ట‌రెడ్డి వ‌ర‌కూ ఇదే తీరు క‌నిపిస్తుంది. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల విష‌యంలో వ్యూహాత్మ‌కంగా ఉండాల్సిన నేత‌లు.. అందుకు భిన్నంగా ప్ర‌శంస‌లు కురిస్తూ పార్టీని అడ్డంగా బుక్ చేయ‌టం క‌నిపిస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల్ని చూస్తే.. ఎప్పుడు ఎవ‌రిని ఎలా పొగ‌డాలో కూడా తెలీదా? అనిపించ‌కమాన‌దు.
Tags:    

Similar News