కేసీఆర్ కి - తుగ్లక్ కి తేడా ఏముంది? - కాంగ్రెస్

Update: 2019-07-01 13:09 GMT
తెలంగాణలో పోరాటాలు చేయడానికి అవకాశం కోసం ఎదురుచూసే కాంగ్రెస్ పార్టీకి సచివాలయం నిర్మాణం రూపంలో కేసీఆర్ మరో అవకాశం కల్పించారు. 400 కోట్లు పెట్టి ఉన్న బిల్డింగులు కూలగొట్టి కొత్తది కట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఈరోజు సచివాలయం సందర్శనకు వెళ్లారు. ఈ బృందంలో సీనియర్ కాంగ్రెస్ నేతలు శ్రీధర్ బాబు - భట్టివిక్రమార్క - వీహెచ్ - జీవన్ రెడ్డి - కొండా విశ్వేశ్వర్ రెడ్డి - రేవంత్ రెడ్డి తదితరులు ఉన్నారు. సందర్శన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.

ఇప్పటికీ దృఢంగా - సకల సదుపాయాలతో విశాలంగా ఉన్న సచివాలయం పడగొట్టడం అత్యంత తెలివి తక్కువ చర్య - ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలు అన్నీ 13వ శతాబ్దపు పాలకుడు మహ్మద్ బిన్ తుగ్లక్ లా ఉన్నాయని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లలో పెరిగిన అప్పులతో ఇప్పటికే కష్టంగా ఉన్న ఖజానాకు ఇది మరో భారం అన్నారు సీనియర్ నాయకులు భట్టి విక్రమార్క. ముఖ్యమంత్రి మారినపుడల్లా కొత్త భవనాలు కట్టాలంటే అది ప్రజలకు భారమని, ఇదేమీ కేసీఆర్ సొంత వ్యవహారం కాదని విమర్శించారు. ఇవే డబ్బులు ఆగిపోయిన డబుల్ బెడ్ రూంల నిర్మాణానికి ఖర్చుపెడితే పేదలకు ఉపయోగమని - లేదంటే నిరుద్యోగుల ఉపాధి కల్పనకు అయినా ఖర్చుపెట్టాలని కాంగ్రెస్ సూచించింది.

ఐదారు లక్షల చదరపు అడుగుల భవనం కట్టడానికి మొన్న శంకుస్థాపన చేశారు. ఇపుడు అది కట్టాలంటే ఇప్పటికి మంచి స్థితిలో ఉన్న ప్రస్తుత భవనాలు కూలదోయాలి. పాతిక ఎకరాల్లోని సుమారు 10 భవనాలు పడగొట్టడం అవసరమా? అదికూడా మంచి స్థితిలో ఉన్నవి పడగొట్టడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం అన్నారు.

ఇదిలా ఉంటే మొన్న కోర్టులో దీనిపై దాఖలైన పిటిషనుపై కూడా సందిగ్దత ఉంది. వాస్తు కారణాలు కోర్టులు అంగీకరించవు. ఇంక ఏ కారణాలు చెప్పినా కోర్టు అంత సులువుగా ఒప్పుకునే అవకాశం ఉందా లేదా అన్నది తెలియాలంటే వేచిచూడాలి. పైగా ఒక వేళ కట్టాలంటే కొత్త స్థలంలో కట్టడానికి ఒప్పుకుంటాయేమో గాని కాంగ్రెస్ వేసిన పిటిషను మంచి భవనాలు ఎందుకు కూలగొట్టడం ? అన్న కోణంలో దాఖలు చేయడంతో  కేసీఆర్ కు చిక్కొచ్చి పడింది. ఈ పిటిషనులో కోర్టు కాంగ్రెస్ అనుకూలంగా తీర్పు ఇస్తే... అది కేసీఆర్ కు అతిపెద్ద దెబ్బగా మారనుంది.
Tags:    

Similar News