కాంగ్రెస్ ఎంపీ జాబితా.. ఓడినోళ్లకే మళ్లీ సీట్లు

Update: 2019-03-01 07:01 GMT
కాంగ్రెస్ కు మరో ఆప్షన్ లేదు.. తెలంగాణలో ఇప్పట్లో కోలుకునే అవకాశాలు లేవు. అందుకే పాతకాపులనే మళ్లీ తెరపైకి తెస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినోళ్లనే పార్లమెంట్ బరిలో దింపడానికి దాదాపు నిర్ణయించింది. మరి ఒక్క నియోజకవర్గంలోనే గెలవని వీరు.. మొత్తం ఏడు నియోజకవర్గాలుండే పార్లమెంట్ లో గెలుస్తారా? అక్కడా ఓడిపోతారా.? ఇంతకీ పార్లమెంట్ బరిలో నిలిచే ఆ కాంగ్రెస్ నేతలు ఎవరనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది..

మామూలుగా ఒక సీటులో ఓడిపోయిన వాళ్లను మళ్లీ మరో బరిలో దింపడానికి దేశంలోని ఏపార్టీ ముందుకు రాదు.. కానీ మన వందేళ్ల కాంగ్రెస్ పార్టీలోనే ఇలాంటి చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటాయి. అలాగే ఈసారి కూడా ఓడినోళ్లనే మళ్లీ ఎంపీ బరిలో దించేందుకు కాంగ్రెస్ రెడీ అయ్యింది.

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఓడిపోయిన రేవంత్ రెడ్డి, డీకే అరుణ, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర, పొన్నాల, శ్రీశైలం గౌడ్ సహా చాలా మంది నేతలు పార్లమెంట్ బరిలో మరోసారి దిగడానికి రెడీ అయ్యారు.

కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన నేతలను కాకుండా గెలుపు గుర్రాలను బరిలో దించితే ఆ పార్టీకి మేలు జరిగేది. కానీ ఓడిన నేతలు మరోసారి పదవుల ఆశతో లాబీయింగ్ చేయడం.. దానికి అధిష్టానం తలొగ్గడం విస్తుగొలుపుతోంది. ఇక గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్లమెంట్ బరిలో దింపేందుకు కాంగ్రెస్ రెడీ అవ్వడం విస్తుగొలుపుతోంది. ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆత్రం సక్కు, ములుగు నుంచి గెలిచిన సీతక్కను మహబూబాద్ ఎంపీగా పోటీచేయించానుకోవడం కూడా కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ గా చెప్పవచ్చు. ఇలా పదవులు ఉన్నా వారికే పదవులు, ఓడిపోయిన నేతలకు మళ్లీ అవకాశాలు ఇస్తూ కొత్త వారికి చాన్స్ ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల్లో నిరసన వ్యక్తమవుతోంది.

* కాంగ్రెస్ ప్రకటించే ఎంపీలో జాబితా ఇదేనట.. (ప్రాథమికంగా అనుకుంటున్నారు)

1.నల్గొండ- కోమటిరెడ్డి వెంకటరెడ్డి

2. మహబూబ్ నగర్- డీకే అరుణ లేదా రేవంత్ రెడ్డి

3. మల్కాజిగిరి -శ్రీశైలం గౌడ్ లేదా రేవంత్ రెడ్డి

4.కరీంనగర్- పొన్నం ప్రభాకర్

5. సికింద్రాబాద్-సర్వే సత్యానారాయణ లేదా అంజన్ కుమార్ యాదవ్

6.పెద్దపల్లి-విజయరమణరావు

7. ఆదిలాబాద్ - ఆత్రం సక్కు (ఆసిఫాబాద్ ఎమ్మెల్యే

8. మహబూబాబాద్- సీతక్క (ములుగు ఎమ్మెల్యే)

9. ఖమ్మం - రేణుక

10.నిజామాబాద్-మధుయాష్కీ

11. మెదక్-దామోదర రాజనర్సింహా

12. భువనగిరి- పొన్నాల లక్ష్మయ్య

13. హైదరాబాద్ - అజారుద్దీన్

14. నాగర్ కర్నూల్ - నాగం జనార్ధన్ రెడ్డి


Tags:    

Similar News