కాంగ్రెస్‌.. ఆపరేషన్‌ రివర్స్‌!

Update: 2015-04-14 13:56 GMT
తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్‌ పార్టీకి ఫలితం దక్కలేదు. పైగా, ఆ పార్టీ నేతలంతా వలస పోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే, కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో ఖాళీ అయిందనే పరిస్థితి. గత తొమ్మిది నెలలుగా ఈ పరిస్థితి ఉన్నా.. ఎట్టకేలకు కాంగ్రెస్‌ పార్టీ కళ్లు తెరుచుకుంది. పార్టీని కాపాడుకునేందుకు చర్యలు చేపట్టింది. పార్టీ సీనియర్‌ నేత డి.శ్రీనివాస్‌ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని వేసింది. వలసలకు చెక్‌ చెప్పాలని నిర్ణయించింది. కేసీఆర్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు చెక్‌ చెప్పి పార్టీ నేతలను తిరిగి తెచ్చుకునే ఆపరేషన్‌ రివర్స్‌కు శ్రీకారం చుట్టింది.

వాస్తవానికి, కాంగ్రెస్‌ పార్టీ కాస్త ఆలస్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తున్నా.. సరైన సమయంలోనే కాంగ్రెస్‌ సరైన నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ప్రభ వెలిగిపోతున్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దానికి అంత ప్రభావం, ఉపయోగం ఉండేది కాదు. కానీ, కేసీఆర్‌ ప్రాబల్యం ఇప్పుడిప్పుడే మసకబారుతోంది. కేసీఆర్‌ నిర్ణయాలు ఎదురు తిరగడం ప్రారంభమయ్యాయి. వివిధ పార్టీల నాయకులు కూడా టీఆర్‌ఎస్‌లోకి ఇప్పుడు వెళ్లడం మంచిదా కాదా అనే పునరాలోచనలో పడ్డారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయం సాధిస్తే టీఆర్‌ఎస్‌కు మరికొంతకాలం ప్రాబల్యం ఉంటుంది. అందులో ఓడిపోతే మాత్రం ఇక అక్కడి నుంచి టీఆర్‌ఎస్‌ పతనం ప్రారంభం అయినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతానికి వలసలకు అడ్డుకట్ట వేసి, కొంత కాలం తర్వాత ఆపరేషన్‌ రివర్స్‌కు శ్రీకారం చుట్టడం మంచి ఆలోచనగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..

Tags:    

Similar News