కాంగ్రెస్ పోస్టుమార్టం మీటింగుకు కొందరికే పిలుపు..

Update: 2018-12-31 06:37 GMT
తెలంగాణ ఎన్నికల్లో దారుణ పరాజయం తరువాత కాంగ్రెస్ పార్టీ నేతలంతా తమతమ కలుగుల్లోకి వెళ్లిపోయారు. దాదాపు 20 రోజుల గ్యాప్ తరువాత ఇప్పుడు ఈ పరాజయంపై పోస్ట్ మార్టం పని పెట్టుకున్నారు. ఇందుకోసం రాష్ట్ర నాయ కత్వం సోమవారం ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ భేటీకి పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు డాక్టర్‌ రామ చంద్ర కుంతియా హాజరవుతుండగా.. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి - కార్య నిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి - కుసుమకుమార్‌ - అజారుద్దీన్‌ - పొన్నం ప్రభాకర్‌ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క - ఇతర సీనియర్లు హాజరు కానున్నారు.
 
ఎన్నికల్లో ఓటమి తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌ పెద్దలు ఎటువంటి సమీక్షా సమావేశాలు నిర్వహించలేదు. అయితే... ఉత్తమ్ ఇప్పటికే అధిష్ఠానానికి ఒక రిపోర్టు పంపించారన్న ప్రచారం మాత్రం ఉంది. మరోవైపు రాష్ట్ర వ్యవహారాల బాధ్యతల నుంచి తనను తప్పించాలని కుంతియా ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కోరినట్లు ప్రచారం కూడా జరిగింది. ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించినా తెరాస వైఫల్యాలను ఎండగట్టినా ప్రజా కూటమి ఏర్పాటు చేసి అందులో ప్రధాన పార్టీలను భాగస్వామ్యులను చేసినా పరాజయం పాలు కావడం పట్ల కాంగ్రెస్‌ పార్టీ షాక్‌ కు గురైంది. ఆ షాక్‌ నుంచి తేరుకుని లోక్‌ సభ - పంచాయతీ - సహకార ఎన్నికలకు సిద్ధం కావాలని రాహుల్‌ గాంధీ ఇచ్చిన పిలుపుతో మళ్లి పార్టీని బలోపేతం చేసే దిశగా రాష్ట్ర నాయ కత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే సోమవారం ఎన్నికల ఓటమిపై సమీక్ష నిర్వహించి - వచ్చే ఎన్నికలకు సన్నద్ధం కావాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
 
అయితే... ఈ సమావేశానికి అందర్నీ కాకుండా కొంతమందిని మాత్రమే ఆహ్వానించడం పట్ల పార్టీలో పోరు మొదలైంది. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులతో పాటు ఓటమి పాలైన వారిని పిలిస్తే క్షేత్రస్థాయిలో ఓటమికి గల అంశాలను వారు వివరిస్తారని - వచ్చే ఎన్నికల్లో ఈ సమస్యలను అధిగ మించవచ్చని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా పీసీసీ రాష్ట్ర నాయకత్వం ఏకపక్షంగా వ్యవహరించడం భావ్యం కాదని సమావేశానికి సీనియర్లతో పాటు ఎన్నికల్లో బాగస్వామ్యమైన ప్రతి ఒక్కర్నీ ఆహ్వానించాలని కోరుతున్నారు. దీంతో ఈ పోస్టుమార్టం మీటింగ్ రచ్చరచ్చ కావడం ఖాయమని భావిస్తున్నారు.

Full View

Tags:    

Similar News