కేసీఆర్ పై వార్ కి 15 ఆయుధాలు రెఢీ

Update: 2018-02-12 04:51 GMT
నిన్న మొన్న‌టి వ‌ర‌కూ కామ్ గా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు ఒక్కొక్క‌రిగా యాక్టివ్ అవుతున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పార్టీ ప‌రాజ‌యం పాలైన త‌ర్వాత కూడా యాక్టివ్ గా ఉన్న వారు కొద్ది మందే. ప‌వ‌ర్లో ఉన్న‌ప్పుడు హ‌డావుడి చేసిన నేత‌లు.. ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత కామ్ అయ్యారు. ఎన్నిక‌ల వేళ వ‌ర‌కూ చూసీచూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించి.. ఆ త‌ర్వాత రంగ ప్ర‌వేశం చేయాల‌న్న ఆలోచ‌న‌లో కొంద‌రు మునిగిపోతే.. వ్యాపారాలున్న నేత‌లు మ‌రికొంద‌రు మాత్రం తెలంగాణ అధికార‌ప‌క్షంతో తెర వెనుక డీల్స్ తో త‌ల‌మున‌క‌లైన‌ట్లుగా చెబుతారు.

మొత్తంగా తెలంగాణ అధికార‌ప‌క్షం వైఫ‌ల్యాల్ని ఎండ‌గ‌ట్టే విష‌యంలో కాంగ్రెస్ నేత‌లు క‌సిగా లేర‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తుంటారు. బ‌ల‌హీన‌మైన విప‌క్ష‌మే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ బ‌లంగా అభివ‌ర్ణించేవారు లేక‌పోలేదు. ఇదిలా ఉంటే.. త‌మ‌లోని త‌ప్పుల్ని సరిదిద్దుకోవ‌టానికి తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు సిద్ధ‌మ‌వుతున్నారు. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస్తున్న నేప‌థ్యంలో ఒక్కొక్క‌రిగా యాక్టివ్ అవుతున్నారు.

ఇదే స‌మ‌యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ వైఫ‌ల్యాల‌పై సోష‌ల్ మీడియాలో వార్ ను డిక్లేర్ చేసిన‌ట్లుగా క‌నిపిస్తోంది. గ‌డిచిన మూడున్న‌రేళ్ల వ్య‌వ‌ధిలో పాల‌నా ప‌రంగా త‌ప్పుల‌తో పాటు.. త‌ప్పుడు హామీలిచ్చిన వైనాన్ని ఎత్తి చూపే ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేశారు. ఇందుకు 15 ఆయుధాల్ని సిద్ధం చేశారు.

గ‌తంలో గొప్ప‌గా చెప్పుకున్న హామీల విష‌యంలో కేసీఆర్ తీరు ఎలా ఉంద‌న్న విష‌యంతో పాటు.. వ‌రాలు ఇచ్చే వేళ కేసీఆర్ ఎంత న‌మ్మ‌కంగా త‌న మాట‌ల్ని చెబుతారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ నేతి బీర‌ల్లాంటి హామీల్లో ప‌స ఎంతన్న విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేలా చెప్పేందుకు వీలుగా ప్ర‌చారాన్ని షురూ చేశారు. సోష‌ల్ మీడియాలో కేసీఆర్ వైఫ‌ల్యాల్ని ఎండ‌గ‌ట్టే ప్ర‌చారాన్నిషురూ చేశారు.
 
ఆన్ లైన్ ను వేదిగ్గా చేసుకొని స్టార్ట్ చేసిన 15 అంశాల్ని చూస్తే..

1. తెలంగాణ‌కు ద‌ళితుడ్ని సీఎం చేస్తాన‌న్న‌ది ఎవ‌రు?

2. పేద‌ల‌కు డ‌బుల్ బెడ్రూం ఇళ్లు ఎన్ని ఇప్ప‌టిదాకా ఇచ్చావ్‌?

3. ద‌ళితుల‌కు 3 ఎక‌రాల భూమి ఇస్తాన‌న్న‌ది ఎవ‌రు?

4. ముస్లింల‌కు 12 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తామ‌ని మోసం చేసిందెవ‌రు?

5. ఇంటికో ఉద్యోగం చొప్పున ల‌క్ష ఉద్యోగాలు  ఏవి?

6. గిరిజ‌నుల‌కు 12 శాతం రిజ‌ర్వేష‌న్ల మాటేంది?

7. డిసెంబ‌రు 31 - 2017 నాటికి ఇంటింటికి నీళ్లు ఇవ్వ‌కుంటే ఓట్లు అడ‌గ‌న‌ని అన్నావ్‌.. ఇచ్చావా?

8. రైతుల‌కు రుణ‌మాఫీ చేశారా?

9. కేజీ నుంచి పీజీ వ‌ర‌కు ఉచిత నిర్భంధ విద్య ఏది?

10. తండాల్ని పంచాయితీలు చేశారా?

11. హైద‌రాబాద్‌ కు ఐటీఐఆర్ వ‌చ్చిందా?

12. గిరిజ‌న విశ్వ‌విద్యాల‌యం ఎక్క‌డ?

13. ఎయిమ్స్‌.. నిమ్స్ సంగ‌తేంది?  నిధుల సేక‌ర‌ణ ఏమైంది?

14. మ‌హిళా మంత్రికి కేబినెట్ లో స్థానం ఎందుకు క‌ల్పించ‌లేదు?

15. రైతుల పంట‌కు గిట్టుబాటు ధ‌ర క‌ల్పించారా?


Tags:    

Similar News