కాపుల మ‌ద్ద‌తు కోల్పోతున్న టీకాంగ్రెస్‌

Update: 2017-03-25 09:50 GMT
ఇప్ప‌టికే తెలంగాణ‌లో బ‌ల‌హీన‌ప‌డిన కాంగ్రెస్ పార్టీకి మ‌రో కీల‌క వ‌ర్గం దూర‌మ‌వుతోంద‌ని వార్త‌లు వెలువ‌డుతున్నాయి. తెలంగాణ‌లో బ‌ల‌మైన కులాల్లో ఒక‌టైన కాపులు హ‌స్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చి అధికార టీఆర్ ఎస్ పార్టీకి చేరువ అయ్యేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి.  కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు, ఆ పార్టీలో ఉన్న నేత‌ల గ‌త చ‌రిత్ర‌ను చూస్తే కాపులు పెద్ద బ‌లం. అయితే పార్టీ అధిష్టానం చ‌ర్య‌లు, కొంద‌రు నాయ‌కుల వ్య‌వ‌హార‌శైలితో కాపు నేత‌లు కాంగ్రెస్‌ కు దూరం అవుతున్నార‌ని అంటున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన వ‌రుస ప‌రిణామాలు ఇందుకు నిద‌ర్శ‌నంగా చెప్తున్నారు.

కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌ మంత్రి పొన్నాల ల‌క్ష్మ‌య్యను అనూహ్య రీతిలో పీసీసీ అధ్య‌క్ష స్థానం నుంచి తొల‌గించడం పార్టీ వ‌ర్గాల కాపుల‌ను దూరం పెడుతున్నాయ‌నే విశ్లేష‌ణ‌కు బీజం వేశాయ‌ని అంటున్నారు.  పీసీసీ అధ్య‌క్షుడి హోదాలో ప‌నిచేసి సీనియ‌ర్ నేత‌గా పేరొందిన మాజీ మంత్రి డి.శ్రీ‌నివాస్‌(డీఎస్)కు  కాంగ్రెస్ లో తీవ్ర ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులు ఎదుర‌య్యాయ‌ని గుర్తుచేస్తున్నారు. అందుకే ఆయ‌న కాంగ్రెస్‌ కు టాటా చెప్పి టీఆర్ ఎస్‌ లో చేరార‌ని అంటున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న నేతి విద్యాసాగ‌ర్ సైతం కాంగ్రెస్ పై అసంతృప్తితో టీఆర్ ఎస్‌ లో చేరడం ఇందుకు ఉదాహ‌ర‌ణ  అంటున్నారు. ఆ వెంట‌నే ఆయ‌న ప‌ద‌వీకాలం ముగుస్తున్న‌ప్ప‌టికీ కేసీఆర్ ఎమ్మెల్సీ సీటును తిరిగి కేటాయించడ‌మే కాకుండా మండలి ఉపాధ్య‌క్షుడి అవ‌కాశం క‌ల్పించారు.

తెలంగాణ‌లో రెడ్డి కుల‌స్తుల త‌ర్వాత కాపులు రెండో బ‌ల‌మైన సామాజిక‌వ‌ర్గం. తెలంగాణ‌లో దాదాపు 27 శాతం జ‌నాభా కాపుల‌దే(మున్నురు కాపుల‌ని తెలంగాణ‌లో అంటారు) రెడ్డిల జ‌నాభా కేవ‌లం 4.7 శాతం ఉంది. ఈ నేప‌థ్యంలో కాపుల‌లోని రెండో త‌రం నాయ‌కులు ఇప్ప‌టికే త‌మ సామాజికవ‌ర్గానికి ప్రాధాన్యం ద‌క్క‌క‌పోవ‌డంపై అసంతృప్తితో ఉన్నారు. కాపులు కీల‌కంగా ఉన్న న‌ల్ల‌గొండ‌ - నిజామాబాద్‌ - ఆదిలాబాద్‌ - వ‌రంగల్‌ - క‌రీంన‌గ‌ర్ జిల్లాల‌కు చెందిన నాయ‌కులు తాము కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్తామ‌ని ఇప్పటికే సంకేతాలు పంపిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే మెజార్టీ రెడ్డి నేత‌ల‌ను త‌న‌వైపు తిప్పుకోవ‌డంలో విజ‌యం సాధించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వ‌ర‌లో కాపుల ద్వారా కాంగ్రెస్‌ ను మ‌రింత బ‌ల‌హీనం చేస్తార‌ని అంచ‌నా వేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News