ఏడేళ్లు ఏడవలేదు ఇప్పుడు ఏదో పొడిచేస్తారా? సీనియర్లు మారరా?

Update: 2022-12-19 02:30 GMT
తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించేసి.. దానికి అవసరమైన కసరత్తు చేస్తున్న వేళ.. టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేసే అంశంపై అధినాయకత్వం తీవ్రంగా ఆలోచిస్తున్న వేళ. అలాంటి వేళలో ఇప్పుడు చెప్పుకునే సో కాల్డ్ సీనియర్లు పలువురు జన్ పథ్ కు పోటెత్తారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు. బక్కపల్చటి కేసీఆర్.. ఆయన పార్టీ అవసరం లేదని.. తమకు మించిన తోపులు లేరంటూ అదే పనిగా ఉదరగొట్టేశారు. తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన పలువురు నేతలు.. అధినాయకత్వంలో తమ తరఫున పైరవీలు చేసే వారితో మేడమ్ మనసు మార్చే ప్రయత్నం చేశారు.

తెలంగాణ కాంగ్రెస్ నేతల మాటలపై సందేహం కలిగిన సోనియా.. ఆ విషయాన్ని ఏం చేయాలన్న దానిపై కాస్తంత కసరత్తు చేసిన సమయంలోనూ లాబీయింగ్ ద్వారా ఆమెను ప్రభావితం చేయటం తెలిసిందే. మొత్తంగా తాము అనుకున్నట్లుగా టీఆర్ఎస్ ను పార్టీ విలీనం కాకుండా అడ్డుకోవటంలో విజయం సాధించారు. అప్పట్లో కేసీఆర్ కు ఇబ్బందికర పరిస్థితి ఉంది. కష్టపడి సంపాదించిన తెలంగాణలో తాను రాజ్యాధికారాన్ని చేపట్టాలే తప్పించి.. తాను
పెంచి పెద్ద చేసిన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలిపేయటం కేసీఆర్ కు సుతారం ఇష్టం ఉండేది కాదు.

అలా అని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఇచ్చిన మాట తప్పే అవకాశం లేదు అప్పట్లో. అలాంటి వేళలో కేసీఆర్ నెత్తిన పాలు పోసింది మరెవరో కాదు.. తమకు మించి తోపులు లేరని చెప్పుకునే ఇప్పటి సీనియర్లే.. అప్పట్లో టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో కలవకుండా అడ్డు పడింది. టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో కలిపేస్తే.. తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని సోనియాను కేసీఆర్ అడుగుతారు కాబట్టి.. అలా అడిగితే తమకు సీఎం పదవి ఎక్కడ మిస్ అవుతుందో అన్న పిచ్చి లెక్కలు వేసుకొని ఎవరికి వారు.. కాంగ్రెస్ లో కలిసిపోవాల్సిన గులాబీ పార్టీని ఆపేశారు. చివరకు జరిగిందేమిటో అందరికి తెలిసిందే.

సీనియర్ల పేరుతో తమను తాము గొప్పగా భావించుకునే తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఎంత మంది గడిచిన ఎనిమిదిన్నేళ్లుగా నిర్విరామంగా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కోట్లాడింది? మరెంత మంది కేసీఆర్ సర్కారు నిర్ణయాల్ని తప్పు పడుతూ ఉద్యమాలు చేశారు? లాంటి లెక్కలు తీస్తే వారి మాటలకు చేతలకు మధ్యన ఉన్న దూరం ఇట్టే అర్థమవుతుందని చెప్పాలి. పదవుల పేరాశతో పార్టీని నాశనం చేసేలా నిర్ణయాలు తీసుకునే వారిగా సీనియర్లపై విరుచుకుపడుతున్నారు కాంగ్రెస్ వాదులు.

పార్టీ మీద అభిమానంతో తాము ఉంటే.. పదవుల పిచ్చి తప్పించి పార్టీ గురించి ఏనాడు ఆలోచించని కాంగ్రెస్ నేతలు ఇవాల్టి రోజున రేవంత్ కువ్యతిరేకంగా జట్టు కడుతున్న తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు. రేవంత్ కు టీపీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెట్టానికి ముందు రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడెలా ఉందన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోలేనితనంతో ఉండటం దేనికి నిదర్శనం? రేవంత్ చేతికి పగ్గాలు లేని ఏడేళ్ల కాలం ఏం చేశారు? ఇప్పుడేదో చేస్తామరి వీరంగం చేయటానికి అంటూ తెలంగాణ కాంగ్రెస్ వాదులు సీనియర్ల మీద విరుచుకుపడుతున్నారు.

పదవుల పంచాయితీతో లేనిపోని రచ్చ చేసి పార్టీ ప్రతిష్ఠను బజారున పడేయటం తప్పించి ఇంకేమీ చేయటం వారికి రాదన్న మాట పలువురి నోట వినిపిస్తుండటం గమనార్హం. ఎప్పుడూ ఏదో పొడిచేస్తామన్న మాటే తప్పించి.. పోరాటాలు చేయని సీనియర్లు.. తమ ఏడుపుగొట్టు తీరుతో పార్టీకి ఇంతకాలం చేసిన నష్టం సరిపోదన్నట్లుగా ఇప్పుడు మరిన్ని నాటకాలు మొదలు పెట్టారన్న విమర్శ సగటు తెలంగాణ కాంగ్రెస్ వాదుల నోట వినిపిస్తోంది. మరి.. వారి ఆవేదన సీనియర్లకు వినిపించే అవకాశం ఉందా?
Tags:    

Similar News