గవర్నర్, టీఆర్ఎస్ వార్ పై పెట్రోల్ పోస్తున్న కాంగ్రెస్

Update: 2022-04-19 17:30 GMT
తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వర్సెస్ ప్రభుత్వం మధ్య వార్ పై మరింత పెట్రోల్ పోసి రాజేయడానికి కాంగ్రెస్ రెడీ అయ్యింది. ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  గవర్నర్ కు తెలంగాణ ప్రభుత్వ లూప్ హోల్స్ అన్నీ చెప్పి రెచ్చగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి అందుకున్నారు. దీనిపై మరింతగా పెట్రోల్ పోసే ప్రయత్నం చేశారు.  సీఎం కేసీఆర్ పై గవర్నర్ తమిళిసై బాహాటంగానే స్పందించడం.. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా విమర్శించడం పరిపాటిగా మారింది.

ఈ క్రమంలోనే ప్రభుత్వ తీరును విపక్షాలు తప్పుపడుతున్నాయి. గవర్నర్ ప్రొటోకాల్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశాయి. దీనిపై కేంద్రమాజీ మంత్రి రేణుకా చౌదరి స్పందించారు. రాష్ట్రంలో గవర్నర్ ప్రొటోకాల్ అమలు కావడం లేదని మండిపడ్డారు. గవర్నర్ పర్యటనకు సెక్యూరిటీకల్పిండం లేదన్నారు. మహిళా గవర్నర్ ను అవమానిస్తున్నారని రేణుకా విమర్శించారు.

బీజేపీ కార్యకర్త ఆత్మహత్య కేసులో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నిందితుడిగా ఉన్నా.. ఎందుకు అరెస్ట్ చేయడం లేదని రేణుకా చౌదరి నిలదీశారు. రాజ్యాంగ వ్యవస్థలో భాగమైన గవర్నర్ హోదాను అవమానానికి గురిచేస్తున్నారని విమర్శించారు.

నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలకు గవర్నర్ వెళితే కనీసం సెక్యూరిటీ కల్పించరా? అని రేణుకా చౌదరి నిలదీశారు. ఐఏఎస్, ఐపీఎస్ లకు రాజకీయాలతో ఏం సంబంధం అని అన్నారు. గవర్నర్ పర్యటనకు ప్రొటోకాల్ ప్రకారం అధికారులు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. గవర్నర్ మహిళ అని కూడా చూడకుండా అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని విమర్శించారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. సంస్కారం ఉన్న వాళ్లు చేసే పనులు కావన్నారు.

బీజేపీ కార్యకర్త ఆత్మహత్య కేసులో ఏ1 నిందితుడు మంత్రి పువ్వాడ అజయ్ అని.. అయినా ఆయనపై చర్యలు తీసుకోవడం లేదని రేణుకా మండిపడ్డారు. ఖమ్మంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలపై అక్రమంగా పీడీయాక్ట్ కేసులు పెడుతున్నారని విమర్శించారు.
Tags:    

Similar News