కంచుకోట‌ను నిల‌బెట్టుకున్న తెలంగాణ కాంగ్రెస్‌..!

Update: 2022-02-10 12:30 GMT
తెలంగాణ కాంగ్రెస్ క‌మిటీ త‌న కంచుకోట స్థానాన్ని నిల‌బెట్టుకుంది. ఏఐసీసీ నిర్దేశించిన స‌భ్య‌త్వాల న‌మోదులో న‌ల్ల‌గొండ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం మొద‌టి స్థానంలో నిలిచింది. దీంతో న‌ల్ల‌గొండ సీనియ‌ర్ నేత‌ల‌ను అధిష్ఠానం ప్ర‌శంసించింది. అనుకున్న ల‌క్ష్యాన్ని నిర్ణీత స‌మ‌యంలో పూర్తి చేయించిన‌ టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డిని పార్టీ పెద్ద‌లు అభినందించారు.

దేశంలోనే తొలిసారిగా డిజిట‌ల్ స‌భ్య‌త్వ న‌మోదును కాంగ్రెస్ చేప‌ట్టింది. ఈ కార్య‌క్ర‌మాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తెలంగాణలో నిర్వ‌హించేందుకు పార్టీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి సుముఖ‌త వ్య‌క్తం చేశారు. సోనియాగాంధీ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 9న స‌భ్య‌త్వ న‌మోదును ప్రారంభించారు. జ‌న‌వ‌రి 26 నాటికి 30 ల‌క్ష‌ల స‌భ్య‌త్వాలు న‌మోదు చేయాల‌ని టార్గెట్ విధించుకున్నారు. కానీ కాస్త ఆల‌స్యంగా ఫిబ్ర‌వ‌రి 10వ తేదీ నాటికి ఆ ల‌క్ష్యం పూర్త‌యింది.

రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో 34 వేల పోలింగ్ బూత్ లు ఉండ‌గా.. ఒక్కో పోలింగ్ బూత్ లో క‌నీసం 100 స‌భ్య‌త్వాల చొప్పున మొత్తం రాష్ట్రంలో 30 ల‌క్ష‌ల స‌భ్య‌త్వాల‌ను చేయించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. స‌రిగ్గా రెండు నెల‌ల‌కు ఆ ప్ర‌క్రియను పూర్తి చేశారు. అనుకున్న ప‌ని స‌క్ర‌మంగా పూర్తి చేసినందుకు అధిష్ఠానం పెద్దలు రేవంత్ ను.., స‌భ్య‌త్వ న‌మోదు రాష్ట్ర ఇన్‌చార్జి హ‌ర్కార వేణుగోపాల్ ను అభినందించారు.

అయితే.. స‌భ్య‌త్వ న‌మోదును ప‌రిశీలిస్తే ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగుచూశాయి. పార్టీ మాజీ పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న న‌ల్ల‌గొండ పార్ల‌మెంటు స్థానం మొద‌టి ప్లేస్ లో నిలిచింది. రెండో స్థానంలో పెద్ద‌ప‌ల్లి, మూడో స్థానంలో మ‌ల్కాజిగిరి నిలిచాయి. న‌ల్ల‌గొండ‌లో 4 ల‌క్ష‌లు.., పెద్ద‌ప‌ల్లిలో 3 ల‌క్ష‌లు.., మ‌ల్కాజిగిరిలో 2.70 ల‌క్ష‌ల స‌భ్య‌త్వాలు చేశారు. ఇక చివ‌రి మూడు స్థానాల్లో కేవ‌లం ల‌క్ష స‌భ్య‌త్వాల లోపు చేయించిన నియోజ‌క‌వ‌ర్గాలు హైద‌రాబాద్‌, సికింద్రాబాద్‌, ఆదిలాబాద్ ఉన్నాయి.

న‌ల్ల‌గొండ ప‌రిధిలో 4 ల‌క్ష‌ల‌కు పైగా స‌భ్య‌త్వాలు న‌మోదు అయినందుకు జిల్లా నేత‌లు సంతోషంగా ఉన్నారు. దీని కోసం పార్టీ పెద్ద‌లు జానా రెడ్డి, ఉత్త‌మ్‌, దామోద‌ర్ రెడ్డి, ప‌టేల్ ర‌మేష్ రెడ్డి తీవ్రంగా కృషి చేశార‌ట‌.

దీంతో అధిష్ఠానం పెద్ద‌లు, రేవంత్ తో స‌హా అంద‌రూ న‌ల్ల‌గొండ నేత‌ల‌ను అభినంద‌న‌ల‌తో ముంచెత్తుతున్నారు. ఎన్నిక‌ల‌లోనే కాదు.. పార్టీ స‌భ్య‌త్వాల న‌మోదులో కూడా త‌మ జిల్లా కాంగ్రెస్ కు కంచుకోట అని పార్టీ నేత‌లు చెప్పుకుంటున్నారు.



    
    
    

Tags:    

Similar News