అప్పుల పాల‌వుతున్న 'బంగారు' తెలంగాణ‌!

Update: 2022-10-29 02:30 GMT
బంగారు తెలంగాణ.. ఈ పేరు ఎన్నిక‌ల‌కు ముందు.. ఉద్య‌మ సమ‌యంలోనూ భారీ ఎత్తున వినిపించింది. ఇప్పుడు కూడా.. సీఎం కేసీఆర్ లేదా టీఆర్ ఎస్ నేత‌ల‌కు ఎప్పుడైనా అవ‌స‌రం అయితే వెంట‌నే ఈ కామెంట్‌ను కుమ్మేస్తుంటారు. ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్తారు. మ‌న బంగారు తెలంగాణ‌! అంటూ.. ప్ర‌చారం చేస్తారు. అయితే, ఇప్పుడు ఈ బంగారు తెలంగాణ అప్పుల ఊబిలో దిగిపోతోంది.

తాజాగా  రాష్ట్ర ప్రభుత్వం మరి కొంత సొమ్ము రుణంగా తీసుకోనుంది. రిజర్వ్ బ్యాంకు వేయనున్న బాండ్ల వేలంలో మరో రూ.1500 కోట్లను రుణంగా సమీకరించుకోనుంది. ఈ మేర‌కు బ్యాంకుకు కొన్ని ప్ర‌తిపాద‌న‌లు సైతం పంపించింది.

ఈ క్ర‌మంలో రాష్ట్ర ప్రభుత్వం రుణాల ద్వారా రూ.1500 కోట్లను తీసుకుంటుంది. ఇందుకోసం 17, 18 ఏళ్ల కాలానికి 750 కోట్ల  రూపాయ‌ల చొప్పున రాష్ట్ర ఆర్థిక శాఖ బాండ్లు జారీ చేసింది. ఇవి రిజ‌ర్వ్ బ్యాంకుకు చేరిపోయాయి. బాండ్లను రిజర్వ్ బ్యాంకు వచ్చే నెల ఒకటో తేదీన వేలం వేయనుంది. వేలం అనంతరం రాష్ట్ర ఖజానాకు ఆ మొత్తం సమకూరుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.23 వేల కోట్ల రుణం తీసుకుంది. తాజాగా రూ.1500 కోట్లతో.. అప్పు మొత్తం రూ.24,500 కోట్లకు చేరనుంది. క‌ట్ చేస్తే.. విభ‌జ‌న స‌మ‌యానికి రాష్ట్ర ప్ర‌భుత్వం మిగులు బ‌డ్జెట్ లో ఉంది. అలాంటి రాష్ట్రం ఇప్పుడు అప్పులు చేయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

మ‌రోవైపు.. తాజాగా చేస్తున్న అప్పుల‌తో వ‌చ్చే నెల  ఉద్యోగుల‌కు జీతాలు, భ‌త్యాలు ఇచ్చేందుకు వినియోగిస్తార‌ని స‌మాచారం. అదేవిధంగా సామాజిక పింఛ‌న్ల‌కు మాత్రం ప్ర‌స్తుతం వ‌సూలైన ప‌న్నులు స‌రిపెడ‌తార‌ని తెలుస్తోంది. ఏదేమైనా బంగారు తెలంగాణ అప్పుల మ‌యం అవుతుండ‌డం మాత్రం మేధావుల నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేస్తోంది. ఒక‌ప్పుడు డ‌బ్బుల కోసం ఏపీ ఏమైనా చేస్తుంది! అని విమ‌ర్శించిన తెలంగాణ మంత్రులు ఇప్పుడు తాము చేస్తున్న‌ది కూడా అదే క‌దా అనే ఎదురు దాడి వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని చెబుతున్నారు.

నిజానికి క‌రోనా అనంత‌రం హైద‌రాబాద్‌లో వ్యాపారాలు పుంజుకున్నాయి. రియ‌ల్ ఎస్టేట్ కూడా పుంజుకుంది. యుద్ధ‌ప్రాతిప‌దిక‌న ఈ విష‌యంలో అనుమ‌తులు ఇచ్చారు. ఇక‌, ప‌న్నులు, రిజిస్ట్రేష‌న్ చార్జీల‌ను పెంచారు. భారీ ఎత్తున రిజిస్ట్రేష‌న్‌లు  కూడా జ‌రుగుతున్నాయి. మ‌రి ఇలా వ‌స్తున్న ఆదాయం ఎటు పోతోంది? అనేది ప్ర‌శ్న‌గానే మిగులుతోంది. ఎప్ప‌టిక‌ప్పుడు అప్పులు చేయ‌డం ఏపీకి ప‌రిపాటి అనే నానుడి ఇటీవ‌ల కాలంలో వినిపిస్తుండ‌గా ఇప్పుడు ఆ జాబితాలో తెలంగాణ కూడా చేరిపోయిందా? అనే సందేహాలు వ‌స్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News