ఆలీది అజ్ఞానమా? అహంకారమా?

Update: 2016-08-23 04:13 GMT
ఇవాళ దేశం మొత్తం గర్విస్తున్నటువంటి బ్యాడ్మింటన్‌ కోచ్‌ గోపీచంద్‌ ను అవమానించేలా తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి మహమూద్‌ ఆలీ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అవుతున్నాయి. పీవీ సింధు సన్మాన కార్యక్రమంలో ఆలీ చేసిన వ్యాఖ్యలే పెద్ద వివాదంగా మారుతూ ఉన్న సమయంలో - ఆ వ్యాఖ్యల గురించి డిప్యూటీ సీఎం కార్యాలయం వచ్చిన వివరణ మరింత అవమానకరంగా ఉన్నదంటూ కూడా వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇంతకూ డిప్యూటీ ముఖ్యమంత్రి బ్యాడ్మింటన్‌ క్రీడ గురించి గానీ, కోచ్‌ గోపీచంద్‌ గురించి గానీ ఏమీ తెలియక, అవగాహన లేక అజ్ఞానంతో ఈ వ్యాఖ్యలు చేశారా? లేదా, అహంకారంతో ఈ వ్యాఖ్యలు చేశారా? అనేది చాలా కీలకంగా ఉంది.

పీవీ సింధుకు తెలంగాణ సర్కారు నభూతో అనదగిన స్థాయిలో సన్మానం నిర్వహించింది. చాలా సంతోషకరం. ఇద్దరు డిప్యూటీ ముఖ్యమంత్రులు హాజరై కార్యక్రమాన్ని ఘనంగా నడిపించారు.. ఇందుకు అందరూ గర్విస్తున్నారు. అయితే అదే వేదిక మీద డిప్యూటీ సీఎం ఆలీ మాట్లాడుతూ వచ్చే ఒలింపిక్స్‌ లో స్వర్ణం సాధించడం కోసం సింధుకు సరైన కోచింగ్‌ ఇప్పించాలని అనుకుంటున్నట్లుగా సెలవిచ్చారు. సింధు మా తెలంగాణ బిడ్డ - మేం గర్వపడేలా చేసింది అని అన్నారు. అంటే ఆయన మాటలు.. ఇప్పుడున్న గోపీచంద్‌ కోచింగ్‌ అంత నాణ్యమైనది కాదన్నట్లుగా సూటిగానే స్పష్టంగానే ఉన్నాయి. ఇవి గోపీచంద్‌ చిత్తశుద్ధికి నిజంగా అవమానకరమైన వ్యాఖ్యలు. ఆలీ వ్యాఖ్యలపై సర్వత్రా పెద్దస్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యాయి.

ఆ తర్వాత, దీనిపై ఆయన డిప్యూటీ సీఎం ఆఫీసు మరో వివరణ విడుదల చేసింది. 'అంతర్జాతీయ కోచ్‌ లైతే తెలంగాణ క్రీడాకారులు మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు అవకాశం ఉంటుందనే భావన తో ఆలీ అలా అన్నారే తప్ప, గోపీచంద్‌ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదు' అని ఆ వివరణలో పేర్కొన్నారు. నిజానికి ఈ వ్యాఖ్యలు మరింత డేమేజింగ్‌ గా ఉన్నాయి. అంతర్జాతీయ కోచ్‌లు అంటే.. వారికేమైనా కొమ్ములు వచ్చి ఉంటాయా? గోపీచంద్‌ కు కోచ్‌ గా అంతర్జాతీయ స్థాయి లేదని డిప్యూటీ సీఎం భావిస్తున్నారా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. దేశం గురించిన భక్తి - చిత్తశుద్ధితో ఇక్కడే ఉండి సేవలందిస్తున్నందుకు అంతర్జాతీయ నాణ్యత - క్రీడాప్రమాణాలు ఉన్న గోపీచంద్‌ను డిప్యూటీ సీఎం మాటలు దారుణంగా బాధించేలా ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు.
Tags:    

Similar News