సెలవులో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి.. కారణం అదేనా?

Update: 2022-02-19 04:31 GMT
తెలంగాణ రాష్ట్ర డీజీపీ సెలవులో వెళ్లారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆరోగ్య కారణాలతో సెలవు పెట్టటం ఇదే తొలిసారి. ఈ నెల18 నుంచి వచ్చే నెల (మార్చి) నాలుగు వరకు ఆయన సెలవులో ఉండనున్నారు. దీంతో ఆయన స్థానంలో గతంలో హైదరాబాద్ సీపీగా.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఏసీబీ డీజీగా వ్యవహరిస్తున్న అంజనీకుమార్ కు పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఒకవైపు ఏపీ డీజీపీని అనూహ్యంగా మార్చటం.. తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలు తెలిసిందే. ఇలాంటి సమయంలోనే.. డీజీపీ మహేందర్ రెడ్డి సెలవుపై వెళ్లటంతో.. కారణం ఏమిటి? అసలేం జరిగింది? అన్న అంశంపై ఆరా తీస్తే.. అసలు విషయాలు బయటకు వచ్చాయి. గురువారం రాత్రి ఆయన తన  ఇంట్లోని బాత్రూం లో జారి పడినట్లుగా తెలిసింది.

దీంతో ఆయన ఎడమ చేయికి ఫ్యాక్చర్ అయినట్లుగా సమాచారం. దీంతో.. ఆయన్ను విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. దీంతో ఆయన పదిహేను రోజుల పాటు మెడికల్ లీవు తీసుకున్నారు.

 ఈ నేపథ్యంలో ఆయన సథానంలో డీజీపీగా పూర్తి బాధ్యతల్ని అంజనీ కుమార్ కు అప్పగిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్న ఆయనకు డీజీపీగా అదనపు బాధ్యతల్ని ప్రభుత్వం అప్పజెప్పింది.మార్చి నాలుగు వరకు మహేందర్ రెడ్డి సెలవులో ఉండటంతో.. ఆయన స్థానంలో అంజనీకుమార్ అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
Tags:    

Similar News