ఊరించి ఉసురుమనిపించిన పోలీస్ బాస్...

Update: 2015-06-23 06:07 GMT

శాంతి భద్రతల నిర్వహణలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ, పరిపాలన పనలు సాఫీగా సాగే క్రమంలో పోలీసుల పాత్ర ఎనలేనిది. ఈ క్రమంలోనే...వారు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కుంటున్నారని, ఏకబిగిన డ్యూటీలు చేయడం వల్ల కుటుంబాలకు దూరమవడమే కాకుండా ఉద్యోగ విధులు నిర్వర్తించలేకపోతున్నారని పలు విశ్లేషణల ద్వారా తేలింది. అయితే మిగతా ఉద్యోగులవలే అందరికీ ఒకేరోజు సెలవు ఇవ్వడం సాధ్యం కాని పని. దీనికి పరిష్కారంగా వీక్లి ఆఫ్ అనే విధానం తెరమీదకు తెచ్చారు. వారంలో ఒకరోజు సెలవు తీసుకునే అవకాశం ఉంటుందని, తద్వారా విధులకు ఇబ్బందికాదు, పైగా పోలీసులు తమ కుటుంబ సభ్యులతో గడపటం వల్ల మానసిక స్థైర్యం సైతం దెబ్బతినకుండా ఉంటుందని భావించారు. ఈ విషయంలో తెలంగాణ సర్కారు ముందుంటుందని తెలిపారు.

వీక్లీఆఫ్ ఇచ్చేందుకు దాదాపు నిర్ణయం అయిపోయిందని తెలంగాణ హోంమంత్రితో పాటు డీజీపీ సైతం పలు సందర్భాల్లో ప్రకటనలు చేశారు. అయితే తాజాగా ఈ విధంగా సెలవు ఇవ్వడం సాధ్యం కాదని తెలంగాణ డీజీపీ అనురాగ్‌శర్మ స్పష్టం చేశారు. తెలంగాణ పోలీసు శాఖలో సుమారు 18,000 పోలీస్‌ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని డీజీపీ తెలిపారు. ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతితో చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు పోలీసు సిబ్బందికి వారాకోరోజు సెలవు ఇవ్వడం సాధ్యం కాదని డీజీపీ తేల్చేశారు.

వీక్లీ ఆఫ్ పై త్వరలోనే అధికారిక ఉత్తర్వులు రానున్నాయని ఆశపడ్డ పోలీసు సిబ్బందికి డీజీపీ ప్రకటన ఆశనిపాతంగా మారిందనే భావన వినిపిస్తోంది.

Tags:    

Similar News