అసెంబ్లీలో చర్చ... అసెంబ్లీ బయట రచ్చ

Update: 2015-09-29 11:01 GMT
తెలంగాణ అసెంబ్లీలో రైతుల ఆత్మహత్యలపై వాడివేడిగా చర్చ జరుగుతోంది... ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఎండగడుతున్నాయి... ఆ సమయంలో అసెంబ్లీ ఎదురుగానే  ఉన్న ఓ సెల్ టవర్ పైకి రైతు ఒకరు హడావుడి సృష్టించారు. పోలీసులు అక్కడికి చేరుకుని అతనితో మాట్లాడి కిందికి దించే ప్రయత్నాలు చేస్తున్నా ఆయన ససేమిరా అంటున్నాడు... అయితే... అప్పుల పాలైన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుండడం తెలిసిందే.. దాని వల్ల ప్రాణాలు పోవడం తప్ప ప్రయోజనం లేదని అర్థం చేసుకున్నాడో ఏమో ఈ రైతు మాత్రం అసెంబ్లీ ముందు టవరెక్కి తన డిమాండ్లు వినిపించాడు. తనకున్న అప్పులన్నీ తీర్చాలని లేదంటే దూకేసి చనిపోతానని బెదిరించాడు

 రైతు సెల్ టవర్ ఎక్కిన నేపథ్యంలో అసెంబ్లీ ఎదుట భారీ ట్రాఫిక్ జామ్ అయింది. వరంగల్ జిల్లాలోని నెక్కొండ మండలానికి చెందిన ఈ రైతు పేరు సమ్మయ్య... తనకు రూ.2 లక్షల అఫ్పు ఉందని, దానిని తీర్చి తనను గట్టెక్కించాలని అతను కోరుతున్నాడు. పోలీసులు అతనిని కిందకు దించే ప్రయత్నాలు చేస్తున్నారు. తాను నెల రోజులుగా మంత్రులను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నానని, అయినప్పటికీ కుదరడం లేదని, అందుకు టవర్ ఎక్కి నిరసన తెలిపానని చెబుతున్నాడు.

అయితే.. బెదిరింపులు.. ప్రమాదకర నిరసనలు మంచివి కాకపోయినా మిగతా రైతుల్లా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకోకుండా సమస్యను ప్రభుత్వం దృష్టి కి తెచ్చేందుకు సమ్మయ్య చేసిన ప్రయత్నం మంచిదేనన్న వాదన వినిపిస్తోంది. రైతుల ఆత్మహత్యల విషయంలో దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగా ఉన్న టీఆరెస్ ప్రభుత్వం దిగొచ్చేలా ఉద్యమాలు చేస్తామని...  రైతులను కలుపుకొని వెళ్తామని విపక్షాలు అంటున్నాయి.
Tags:    

Similar News