తెలంగాణ : ఫీవర్ సర్వే .. 1.88 లక్షల మందికి కరోనా లక్షణాలు !

Update: 2021-05-19 07:31 GMT
తెలంగాణలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. మే నెల చివరి వరకు సెకండ్ వేవ్ నియంత్రణలోకి వస్తుందని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. లాక్‌ డౌన్‌ తో పాటు ఇంటింటి ఫీవర్ సర్వే మంచి ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. మరో రెండు వారాల్లో కరోనా వ్యాధి పూర్తిగా అదుపులోకి వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 28 వేల బృందాల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఫీవర్ సర్వే చేపట్టినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ సర్కార్ చేపడుతున్న ఫీవర్ సర్వేను అమలు చేయాలని నిర్ణయం తీసుకుందని వివరించారు. ఇప్పటి దాకా సుమారు 80 లక్షల కుటుంబాలను ఈ బృందాలు కలిశాయని, ఇందులో 1.88 లక్షల మందికి మాత్రమే కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలిందని, వారికి మందులు ఇవ్వడంతో పాటు ఎక్కువ లక్షణాలు ఉన్నవారిని ఐసొలేషన్ కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు.

జ్వరం, జలుబు లాంటి లక్షణాలున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా వీరందరికీ ముందుగానే కరోనా  మెడికల్ కిట్లను అందించామన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారు భయపడిపోయి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడానికి టెస్టింగ్ సెంటర్లకు భారీ స్థాయిల వెళ్తున్నారన్నారు. క్యూలైన్లలో వైరస్ వ్యాప్తికి ఎక్కువ ప్రమాదం వస్తున్నట్లు గుర్తించామని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. వైరస్ వ్యాప్తిని నివారించడానికి ప్రాథమిక దశలోనే టెస్టులు చేయించుకోవాలని ప్రభుత్వాలు చెప్తున్నా సెకండ్ వేవ్ తీవ్రతలో ఎక్కువ మంది ఒకేసారి టెస్టింగ్ కేంద్రాల దగ్గరకు వస్తున్నారన్నారు. దీనితో  ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటోందని, దీన్ని నివారించడం కోసమే వారి ఇళ్ళ దగ్గరికే వైద్య బృందాలు వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం మొదటి, రెండవ దశల్లో టీకాల కార్యక్రమం కోసం 45 ఏళ్ళ వయసు పైబడినవారికి ఉచితంగానే వ్యాక్సిన్ ఇవ్వడానికి రాష్ట్రానికి ఇప్పటిదాకా 57.30 లక్షల డోసులను అందించిందని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. 'టీకా ఉత్సవ్' థర్డ్ ఫేజ్‌లో భాగంగా మే 1వ తేదీ నుంచి 18-44 ఏజ్ గ్రూపువారికి కూడా టీకాలు ఇవ్వాల్సి ఉందని, కానీ కేంద్రం నుంచి తగిన సంఖ్యలో రాకపోవడంతో ఇంకా ప్రారంభించలేదని తెలిపారు. గ్లోబల్ టెండర్ల ద్వారా వ్యాక్సిన్లను సమకూర్చుకోనున్నందున త్వరలోనే 18-44 ఏజ్ గ్రూపువారికి కూడా టీకాల పంపిణీని ప్రారంభించనున్నట్లు తెలిపారు. గతేడాదిలోని మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉంది. తెలంగాణలో మాత్రమే కాక దేశవ్యాప్తంగా ఇది అదే తీరులో ఉంది. అందువల్లనే ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య, మృతి చెందుతున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. తొలి వేల్‌తో పోలిస్తే సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ అవసరం పెరిగింది. దీని వెన్నంటే రెమిడెసివిర్ లాంటి ఇంజెక్షన్ల అవసరం కూడా పెరిగింది. టెస్టింగ్ కిట్ల కొరతతో రాష్ట్రంలో తక్కువ సంఖ్యలోనే కరోనా నిర్ధారణ పరీక్షలు జరిగాయి. పాజిటివ్ బారిన పడినవారిలో గతేడాదికంటే ఈసారి ఎక్కువ మంది ఆస్పత్రులపాలు కావాల్సి వచ్చింది.
Tags:    

Similar News