ఉద్య‌మంలో ఫైట్ చేశా.. జాబ్ కావాలి సార్‌!

Update: 2017-08-22 05:49 GMT
తెలంగాణ రాష్ట్రం వ‌స్తే చాలు.. ఉద్యోగాలు కుప్ప‌లు కుప్ప‌లుగా వ‌చ్చేస్తాయి. సీమాంధ్రుల పాల‌నతోనే ఉద్యోగాలు లేకుండా పోయాయి. తెలంగాణ రావ‌టం ఆల‌స్యం ఇంటికో ఉద్యోగం ప‌క్కా. ఉద్యోగాల‌న్నీ తెలంగాణ‌వాళ్ల‌కే అంటూ ఉద‌ర‌గొట్టేసిన వాళ్లు చాలామందే క‌నిపిస్తారు. స‌ర్వ రోగ నివారిణి ప్ర‌త్యేక తెలంగాణ మాత్ర‌మే అంటూ నిన‌దించిన వారు కోకొల్ల‌లుగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డి మూడున్న‌రేళ్లుగా ముగిసిన త‌ర్వాత కూడా ఉద్యోగాలు రాక‌.. రోడ్ల మీద తిరుగుతున్న నిరుద్యోగులు వేలాదిగా క‌నిపిస్తున్నారు.

త‌మ క‌ల‌ల తెలంగాణ వ‌స్తే చాలు.. త‌మ బ‌తుకులు మారిపోతాయ‌ని భావించి.. ఉద్య‌మంలో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన ప‌లువురు ఇప్పుడు ఉద్యోగాల కోసం తిరుగుతున్న వైనం చూస్తే అయ్యో అనిపించ‌క మాన‌దు. తాజా ఫోటో దీనికి నిద‌ర్శ‌నంగా చెప్పాలి. తెలంగాణ సాధ‌న కోసం విప‌రీతంగా ప్ర‌య‌త్నం చేసి.. త్యాగాలు చేసిన ఒక కుర్రాడు త‌న‌కు ఉద్యోగం ఇప్పించాలంటూ తిరుగుతున్న వైనం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

తెలంగాణ వ‌స్తే ఉద్యోగం వ‌స్తుంద‌న్నార‌ని.. తెలంగాణ కోసం చాలానే త్యాగాలు చేశాన‌ని.. కానీ త‌న‌కు మాత్రం ఉద్యోగం రాలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నాడీ యువ‌కుడు. గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం చిన్న కిష్టాపూర్ గ్రామానికి చెందిన నాగ‌రాజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్య‌మంలో చాలా చురుగ్గా వ్య‌వ‌హ‌రించారు. ఉద్య‌మంలో తాను చేసిన ప‌నుల గురించి వివిధ ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన క్లిప్పింగులు ప‌ట్టుకొని.. త‌న‌కు క‌నిపించిన ప్ర‌తి ప్ర‌జాప్ర‌తినిధిని ఉద్యోగం ఇప్పించాల‌ని అభ్య‌ర్థిస్తున్నారు.

ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్పాటు అయిన నాటి నుంచి తాను నాయ‌కుల్ని క‌లుస్తున్నాన‌ని.. కానీ త‌న‌కు ఉద్యోగం మాత్రం రావ‌టం లేద‌న్నారు. తాజాగా ఖైర‌తాబాద్ లో ఎమ్మెల్సీ న‌రేంద‌ర్ రెడ్డి.. మ‌రో మ‌హిళా నేత‌ను క‌లిసిన నాగ‌రాజు తాను తెలంగాణ ఉద్య‌మంలో చురుగ్గా పాల్గొన్నానంటూ త‌న క్లిప్పింగులు చూపిస్తూ.. ఉద్యోగం కోసం అభ్య‌ర్థిస్తున్న వైనం ప‌లువురి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.
Tags:    

Similar News