సుప్రీం కోర్టుకు చేరిన ఏపీ, తెలంగాణల `జల` జగడం

Update: 2020-08-05 15:30 GMT
నీళ్లు, నిధులు, నియామకాలు....ఈ మూడు అంశాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్న ప్రత్యేక రాష్ట్రం కావాలని పట్టుబట్టి మరీ సాధించుకున్నారు తెలంగాణవాసులు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఏపీ, తెలంగాణల మధ్య జలజగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో కృష్ణా జలాల వినియోగంపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపు విషయంలో కొంతకాలంగా వివాదం నడుస్తోంది. అయితే, తాము మిగులు వరద జలాలను మాత్రమే రాయలసీమకు తరలిస్తామని, దీని వల్ల తెలంగాణకు నష్టం లేదని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ సర్కార్ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టింది. దీంతో, ఏపీ సర్కార్ పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉత్తర్వులు రద్దు చేయాలని, టెండర్ల ప్రక్రియను నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచి రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా సీమకు నీరందించాలని ఏపీ ప్రభుత్వం భావించింది.దీనికి సంబంధించి గతంలోనే ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం టెండర్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అయితే, ఈ ప్రాజెక్టుతో తమకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ వాదిస్తోంది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుతోపాటు ఇతర ప్రాంతాలకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టవద్దని బోర్డు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ, ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం టెండర్ల ప్రక్రియపై ముందుకు వెళుతుండడంతో తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నిన్న రాత్రి డిజిటల్ విధానంలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వాస్తవానికి, ఈ వ్యవహారంపై నేడు అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కేంద్ర జల శక్తి శాఖ ప్రతిపాదించింది. అయితే, సీఎం కేసీఆర్ ముందే నిర్ణయించిన కార్యక్రమాల వల్ల ఈ సమావేశానికి హాజరు కాలేదు.
Tags:    

Similar News