మూడో దశకు కేసీఆర్ సర్కారు రెఢీ అవుతోందా?

Update: 2020-03-27 04:41 GMT
కరోనా వైరస్ వ్యాప్తిలో అత్యంత కీలకమైనది.. కష్టమైనది మూడోదశగా అభివర్ణిస్తారు. ప్రస్తుతం తెలంగాణలో రెండో దశ నడుస్తోంది. అది కూడా పూర్తిస్థాయిలో కాదనే మాట వినిపిస్తుంటే.. అలాంటిదేమీ లేదని.. మరో వారం ఆగితే విషయం మీకే అర్థమవుతుందన్న మాట కొందరి నోట వస్తోంది. ఇప్పటికిప్పుడు అయితే.. రెండో దశ ప్రారంభంలోనే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలా అని.. అక్కడితో ఆగినా.. ఆగకున్నా. .తర్వాతి దశకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందన్న యోచనలో ప్రభుత్వం ఉంది.

దీనికి సంబంధించి ఇప్పటికే మూడో దశలోకి వెళితే.. ఏమేం చేయాలన్న అంశంపై కేసీఆర్ సర్కార్ రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ వాదనకు బలం చేకూరేలా తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈటెల మాటలు ఉన్నాయి. కరోనా వ్యాప్తి మూడో దశకు చేరుకున్నంతనే గాంధీని పూర్తిస్థాయి కరోనా ఆసుపత్రిగా మార్చేస్తామని చెప్పారు. అంతేకాదు.. గాంధీలో చేయాల్సిన ఆపరేషన్లను ఉస్మానియాకు తరలిస్తామన్న ఆయన.. కింగ్ కోఠి ఆసుపత్రిని సైతం కరోనా చికిత్స కోసం సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

పరిస్థితి మరింత తీవ్రమైతే.. ప్రైవేటు మెడికల్ కాలేజీలు.. ప్రైవేటు ఆసుపత్రుల్ని కూడా వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అసలు మూడో దశకు వెళ్లకుండానే జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పిన ఈటెల.. ఒకవేళ అలాంటి పరిస్థితే ఏర్పడినా.. ఆ సందర్భంలో ఎదురయ్యే విపరిణామాలకు సిద్ధమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని.. వారిని కలిసిన వారిని పూర్తిస్థాయి పరిశీలనలో ఉంచాలన్న ఆదేశాలు జారీ చేసిన ఆయన.. వైద్య సిబ్బందికి ఎట్టి పరిస్థితుల్లో సెలవులు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. అవసరమైన వైద్య పరికరాల్ని సమీకరించుకోవాలని ఈటెల చెబుతున్నారు ఇదంతా చూస్తున్నప్పుడు.. మూడో దశలోకి వెళ్లాల్సి వచ్చినా.. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పక్కాగా జరుగుతున్న వైనం అర్థం కాక మానదు.
Tags:    

Similar News