భూముల రిజిస్ట్రేషన్లపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం !

Update: 2021-11-10 06:32 GMT
భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం కొత్త మార్గంతో ముందుకి పోవాలని నిర్ణయం తీసుకుంది. ఆ బాధ్యతలను ఇకపై డిప్యూటీ తహసీల్దార్‌ లకు అప్పగించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే డిప్యూటీ తహసీల్దార్‌ లకు ధరణి పోర్టల్‌ లో లాగిన్ సౌకర్యాన్ని కల్పించింది. ఇకపై రిజిస్ట్రేషన్ వ్యవహారాల బాధ్యతలు కూడా వీళ్లే చూడనున్నారు. ధరణి పోర్టల్‌ ను ప్రారంభించి ఏడాది పూర్తికావడంతో వెబ్ సైట్ లో పలు మార్పులు చేర్పులు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ బాధ్యతలు చూసిన తహసీల్దార్‌లకు ఆ భారం నుండి విముక్తి కల్పించనుంది.

డిప్యూటీ తహశీల్దార్లకు ఆ విధులు అప్పజెప్పేందుకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్ బాధ్యతలను తహసీల్దార్‌ లు నిర్వర్తిస్తుండటంతో మిగతా రెవెన్యూ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందనే ఫిర్యాదులు అందాయి. గతంలో తహసీల్దార్‌ లకు రిజిస్ట్రేషన్‌ బాధ్యతలు లేనప్పుడు 50కి పైగా బాధ్యతలు నిర్వర్తించేవారు. ప్రస్తుతం ఆ బాధ్యతలను పరిష్కరించేందుకు వీరికి సమయం లేకపోవడంతో చాలా పనులు పెండింగ్ లో ఉంటున్నాయి. దీంతో పలు జిల్లాల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. అందుకే తహశీల్దార్లకు రిజిస్ట్రేషన్ బాధ్యతలను తప్పించాలని నిర్ణయించింది.

దీంతో పాటు తమకు పనిభారం ఎక్కువైందని రెవెన్యూ సంఘాల నాయకులు తహసీల్దార్ల తరపున సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేయడంతో.. ఆ దిశగా అడుగులు పడినట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళలో ఆర్డీవోలకు అనేక అధికారులు ఉండేవి. ఆ తర్వాత ఆర్డీవోల అధికారాలకు కత్తెర వేసి తహశీల్దార్లకు అదనపు భాద్యతలు అప్పగించారు. ప్రస్తుతం ధరణి వెబ్ సైట్ అందుబాటులోకి వచ్చింది. ప్రజలకు పూర్తిస్థాయిలో తహసీల్దార్లు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. అందుకే డిప్యూటీ తహశీల్దార్లకు ఆ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది.

ధరణి పోర్టల్‌ ను ప్రారంభించి గత అక్టోబర్ నెలకు సంవత్సరం పూర్తైంది. 574 తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఏడాదిలో ధరణి పోర్టల్ ద్వారా 5.17 కోట్ల విలువ గల 10 లక్షల లావాదేవీలు జరగ్గా.. ధరణి ద్వారా లక్షా 80వేల ఎకరాల భూములకు సంబంధించి పట్టాదార్ పాసు పుస్తకాలను అధికారులు జారీ చేశారు. ధరణి పోర్టల్ లో మరో 20 సమస్యలు గుర్తించిన ప్రభుత్వం వాటిని పరిష్కరించడానికి ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసింది.


Tags:    

Similar News