బుల్లితెర పెద్ద తెర షూటింగుల‌కు కేసీఆర్‌ అనుమ‌తి

Update: 2020-06-08 16:30 GMT
మ‌హ‌మ్మారీ విప‌త్తు ఆషామాషీగా లేదు. ఓవైపు ప్ర‌భుత్వాల నుంచి స‌డ‌లింపులు ఉన్నా.. అంతా స‌వ్యంగా సాగుతుందా? అన్న సందేహం నిలువ‌నీయ‌డం లేదు. అంటు రోగం క‌ల‌త సినీప‌రిశ్ర‌మ‌ల్లో అలానే ఉంది. తాజాగా కోవిడ్ 19 మార్గదర్శకాలు.. లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలో సినిమా- టీవీ షూటింగులు కొనసాగించుకోవడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అనుమతి ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫైలుపై సోమవారం నాడు సీఎం సంతకం చేశారు.

రాష్ట్రంలో పరిమిత సిబ్బందితో.. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ సినిమా.. టీవీ కార్యక్రమాల షూటింగులు నిర్వహించుకోవచ్చని.. షూటింగులు పూర్తయిన వాటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వెంటనే నిర్వహించుకోవచ్చని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాల్సి ఉన్నందున థియేటర్లను ప్రారభించడానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.

మెగాస్టార్ చిరంజీవి సార‌థ్యంలో ప‌లువురు ప్రముఖులు ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి షూటింగులు స‌హా పోస్టు ప్రొడక్షన్ పనులకు.. థియేటర్లను తెరవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

అనంత‌రం సినిమాటోగ్ర‌ఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.. సినీరంగ ప్రముఖులు సమావేశమై విధివిధానాల ముసాయిదా రూపొందించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి.. పరిమిత సిబ్బందితో షూటింగులు.. పోస్టు ప్రొడక్షన్ పనులు నిర్వహించుకుంటామని సినీ రంగ ప్రముఖులు హామీ ఇచ్చారు. దీనిని అనుసరించి ముఖ్యమంత్రి కేసీఆర్ షూటింగులు... పోస్టు ప్రొడక్షన్ పనులకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఇప్పటికిప్పుడు సినిమా థియేటర్లను తెరిచేందుకు అనుమతి ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్ర‌క‌ట‌న‌లో స్పష్టం చేసింది.

ఎట్ట‌కేల‌కు షూటింగుల‌కు అనుమ‌తులు వ‌చ్చిన‌ట్టే. అయితే ఆటంకాలు మాత్రం తొల‌గిపోలేదు. ఆన్ లొకేష‌న్ అన్ని నియ‌మాల్ని పాటిస్తూ షూటింగులు చేయ‌డం అన్న‌ది పెద్ద స‌వాల్ తో కూడుకున్న‌ది. ముఖ్యంగా భారీ చిత్రాల‌కు ప‌రిమిత క్రూతో ప‌ని చేయ‌డం అన్న‌ది మ‌రింత ఛాలెంజ్. మ‌రి దానిని ఎలా అధిగ‌మించి స‌జావుగా ప‌ని చేస్తారు? అన‌్న‌ది చూడాలి.
Tags:    

Similar News