మగ పిల్లలకు మర్యాద నేర్పించండి ..తల్లిదండ్రులకి గవర్నర్ వార్నింగ్ !

Update: 2019-12-09 05:26 GMT
ఈ మధ్య కాలం లో ఆడవారి పై అఘాయిత్యాలు , అత్యాచారాలు మరీ ఎక్కువై పోయాయి.ప్రస్తుత రోజుల్లో అసలు ఒంటరిగా ఆడపిల్ల రొడ్డిపైకి వచ్చే ధైర్యమే చేయలేక పోతోంది. దానికి కారణం సమాజంలో ఉన్న కొందరు మానవ మృగాళ్లు. ప్రభుత్వం , పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న కూడా ఆడవారి పై జరిగే ఘోరాలని మాత్రం ఆపలేక పోతున్నారు. తాజాగా హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ దిశ ఉదంతం అందరికి తెలిసిందే. ఈ ఉదంతం పై ప్రతి ఒక్కరు కూడా తమ నిరసన వ్యక్తం చేసారు. తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళ సై మాట్లాడుతూ మొగ్గల్ని తుంచేయ వద్దు...పువ్వుల్ని నలిపేయకండి అంటూ దిశా ఘటనను గుర్తు చేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు.

తమిళనాడు వాణిబర్‌ పేరవై నేతృత్వం లో కోయంబేడు లో ఆదివారం ఓ కార్యక్రమం జరిగింది. ఇందులో తమిళి సై ప్రసంగించారు. దేశ వ్యాప్తంగా ఇటీవల కాలంగా మహిళలకు వ్యతిరేకంగా హింసాత్మక ఘటనలు పెరుగుతుండటం వేదన కల్గిస్తున్నదన్నారు. దేశంలో ప్రతి రోజూ ఏదో ఒక చోట లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశం అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నదని, మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా, హింస అన్నది మాత్రం తగ్గక పోవడం చాలా భాదగా ఉంది అని తెలిపింది.

హైదరాబాద్‌లో దిశపై మానవ మృగాళ్లు సాగించిన హింసాత్మక ఘటనను గుర్తు చేస్తూ, ఆమె ఉద్వేగానికి లోనయ్యారు. ఈ ఘటన మరువక ముందే, ఉత్తరప్రదేశ్‌లో మరో ఘటన వెలుగు చూడటం బట్టి చూస్తే, మహిళలకు భద్రత అన్నది ఆందోళనకు గురి చేస్తున్నదన్నారు. తమిళనాట అశ్లీల వీడియోలను చూసే వారి సంఖ్య మరీ ఎక్కువగా ఉన్నట్టు సర్వేలు పేర్కొనడం బట్టి చూస్తే, ఇక్కడ అబలకు భద్రత అన్నది ప్రశ్నార్థకం గా మారుతోందన్నారు. అలాగే ఆడ బిడ్డల్ని ఏ విధంగా పెంచుతున్నామో, అదే రకంగా మగ బిడ్డల్ని సైతం పెంచాల్సిన పరిస్థితి తల్లిదండ్రుల మీద ఉంది అని తెలిపారు. మహిళలకు ఏవిధంగా గౌరవాన్ని ఇవ్వాలి, ఎలా మర్యాద ఇవ్వాలి, వారిని చూసినప్పుడు ఎలా విలువ ఇవ్వాలి.. అన్న విషయాలను మగ బిడ్డలకు ఉపదేశించి పెంచాల్సిన అవసరం ఉందని పిలుపు నిచ్చారు.దయ చేసి పువ్వుల్ని వికసించ నివ్వండి.. నలిపేయ వద్దు...మొగ్గల్ని తుంచేయ వద్దు ..అంటూ బరువెక్కిన గుండెతో ఉద్వేగంగా మాట్లాడారు.
Tags:    

Similar News