లక్ష మందికి భోజనాలు ?

Update: 2015-12-25 04:33 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగతంగా నిర్వహిస్తున్న అయుత చండీయాగానికి సంబంధించి గురువారం పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. బుధవారం అనుకున్న విధంగా.. అంచనాలకు తగినట్లే 50వేల మంది ప్రజలు రాగా.. రెండో రోజైన గురువారం మాత్రం అంచనాలకు మించిన ప్రజలు హాజరైనట్లుగా చెప్పొచ్చు. అయితే.. పెద్ద ఎత్తున ప్రజలు పోటెత్తినప్పటికీ ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేయటం.. యాగానికి వచ్చిన వారంతా సంతృప్తిగా తిరిగి వెళ్లేలా చేయటంలో కేసీఆర్ అండ్ కో సక్సెస్ అయ్యిందని చెప్పాలి.

దాదాపు లక్ష మంది వరకు ప్రజలకు భోజన ఏర్పాట్లు చేయటం.. అది కూడా ఎలాంటి లోటు లేకుండా అంటే అది చిన్న విషయం కాదు. కష్టసాధ్యమైన ఆ ఫీట్ ను విజయవంతంగా చేయటం అందరిని ఆకట్టుకుంటోంది. అక్షయపాత్రను తలపించేలా ఎంతమంది ప్రజలు వచ్చినా వారందరికి కడుపునిండా భోజనం పెట్టి.. సంతృప్తిగా ఇంటికి పంపటం యాగంలో ప్రత్యేకంగా కనిపించే అంశంగా చెప్పాలి. అంతేకాదు.. యాగాన్ని చూసేందుకు వచ్చిన వారందరికి లడ్డూ ప్రసాదం ఇచ్చి పంపుతున్నారు. ఇంత భారీగా వస్తున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా భోజన ఏర్పాట్లు చేసేందుకు వంటవాళ్లు విపరీతంగా శ్రమిస్తున్న దృశ్యం కనిపిస్తోంది.

ఇదిలా సాగుతుంటే.. మరోవైపు.. మహిళల కోసం నిర్వహిస్తున్న కుంకుమ పూజకు విశేష స్పందన లభిస్తోంది. పెద్ద ఎత్తున మహిళలు కుంకుమ పూజ కోసం క్యూలో నిలుచోవటం కనిపించింది. కుంకుమ పూజ చేసేందుకు వచ్చిన మహిళలందరికి ఓపిగ్గా.. కేసీఆర్ కుమార్తె కవిత.. కేటీఆర్ సతీమణి.. కేసీఆర్ కోడలు అమ్మవారి ప్రసాదంగా చీరలు పంచిపెట్టారు. మరోవైపు.. కన్నెలు.. ముత్తెదువులకు కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేసిన కానుకలు సమర్పించటం కనిపించింది.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇలాంటి భారీ యాగాలు నిర్వహిస్తున్న సమయంలో విరాళాలు.. వస్తువులు తీసుకోవటం కనిపిస్తుంటుంది. కానీ.. కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత చండీయాగంలో అలాంటివి మచ్చుకు కూడా కనిపించని పరిస్థితి. వేలాది మంది భక్తులు తమతో పాటు పూజా వస్తువుల్ని తీసుకొస్తున్నా వాటిని తీసుకోవటం లేదు. దీంతో.. వాటిని వెనక్కి తీసుకెళుతున్నారు. ఉత్త చేతులతో వచ్చి.. నిండు హృదయంతో ఆశ్వీరదించి.. సంతృప్తిగా తిరిగి వెళ్లాలన్నట్లుగా చండీయగం ఏర్పాట్లు సాగుతున్నాయి.
Tags:    

Similar News