డేటా చోరీలో ట్విస్ట్‌!..దర్యాప్తున‌కు సిట్ ఏర్పాటు!

Update: 2019-03-06 15:32 GMT
తెలుగు రాష్ట్రాల మ‌ధ్య పెద్ద అగాథాన్నే స్శ‌ష్టంచ‌డం ఖాయ‌మ‌ని భావిస్తున్న డేటా చోరీ కేసుకు సంబంధించి మ‌రో సంచ‌ల‌న ప‌రిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తున‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేసింది. ఈ కేసులో అస‌లు గుట్టును విప్పేందుకు నేటి సాయంత్రం నేరుగా హైద‌రాబాద్ సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ అంజ‌నీ కుమార్ మీడియా ముందుకు వ‌చ్చి సంగ‌తి తెలిసిందే. ఓ వైపు అంజ‌నీ కుమార్ మీడియా స‌మావేశం జ‌రుగుతుండ‌గానే... అంత‌కుముందే ఆయ‌న స‌మ‌క్షంలోనే తెలంగాణ ప్ర‌భుత్వం ఈ మేర‌కు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.

అంజ‌నీ కుమార్ ప్రెస్ మీట్ ముగిసిన మ‌రుక్ష‌ణ‌మే... తెలంగాణ ప్ర‌భుత్వం సిట్ ఏర్పాటుకు సంబంధించిన ఉత్వ‌ర్వుల‌ను జారీ చేసింది. అంతేకాకుండా ఈ కేసు ద‌ర్యాప్తు బాధ్య‌త‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న సైబ‌రాబాద్ పోలీసులు... ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి అనుకూలంగా కేసు పూర్తి వివ‌రాల‌ను సిట్‌ కు అంద‌జేశారు. ఈ తంతు మొత్తం యుద్ధ‌ప్రాతిప‌దిక‌న చాలా వేగంగా సాగిపోయింది. ఈ సిట్‌కు వెస్ట్ జోన్ ఐజీగా ప‌నిచేస్తున్న సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర‌ను అధిప‌తిగా నియ‌మించింది. కేసుల ద‌ర్యాప్తులో స‌త్తా క‌లిగిన అధికారిగా పేరు సంపాదించిన స్టీఫెన్ ర‌వీంద్ర‌ను సిట్ చీఫ్‌ గా నియ‌మించిన వైనం చూస్తుంటే... ఈ కేసు విచార‌ణలో పెను సంచ‌ల‌నాలే న‌మోద‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ఇక స్టీఫెన్ ర‌వీంద్ర ఆధ్వ‌ర్యంలో ఇప్ప‌టికిప్పుడే రంగంలోకి దిగిపోయిన సిట్ లో ఇత‌ర స‌భ్యులెవ‌ర‌న్న విష‌యానికి వ‌స్తే... సైబర్ క్రైమ్స్ డీసీపీ రోహిణి - కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి - డీఎస్పీ రవికుమార్ - ఏసీపీ శ్రీనివాస్ - మరో ఇద్దరు ఇన్ స్పెక్టర్లు సభ్యులుగా ప్ర‌భుత్వం తేల్చింది. అంతేకాకుండా కేసు ప్రాధాన్యం దృష్ట్యా సిట్ కార్యాల‌యాన్ని డీజీపీ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన ప్ర‌భుత్వం... డీజీపీ కార్యాల‌యంలో ఓ ప్ర‌త్యేక ఛాంబ‌ర్‌ ను కూడా ఏర్పాటు చేసింది. మొత్తంగా ఈ కేసులో ఇప్ప‌టిదాకా న‌మోదైన సంచ‌ల‌నాల‌న్నింటి కంటే కూడా సిట్ ను ఏర్పాటు చేయ‌డంతో పాటుగా దానికి స్టీఫెన్ ర‌వీంద్ర‌ను చీఫ్‌గా నియ‌మించడం మ‌రింత సంచ‌ల‌నంగా ప‌రిగ‌ణించక త‌ప్ప‌ద‌న వాద‌న వినిపిస్తోంది.


Tags:    

Similar News