గప్ చుప్ గా ధరలు పెంచేసిన సారూ.. రూ.4వేల కోట్లకు చిల్లు

Update: 2019-12-17 05:16 GMT
ఆదాయం తగ్గిపోతోంది. ఖర్చులు పెరుగుతున్నాయి. ఎంతకూ తగ్గని లోటు. ఓపక్క సంక్షేమ భారం.. మరోవైపు మాంద్యం పోటు. ఇలాంటి వేళ.. ఆశించినంత ఆదాయం రాక కిందామీదా పడుతున్న వేళ.. కేంద్రం నుంచి సాయం అరకొరగా ఉన్న వేళ.. బంగారు బాతుగుడ్డు లాంటి ఎక్సైజ్ ఆదాయాన్ని మరింత పెంచేలా నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.

గత అక్టోబరు నుంచి తీసుకొచ్చిన సరికొత్త అబార్కీ విధానంలో బాగంగా అప్లికేషన్ల ఫీజు కిందనే ప్రభుత్వానికి రూ.935 కోట్లు కొల్లగొట్టేసిన సారు.. తాజాగా పెరుగుతున్న లోటును తగ్గించుకోవటానికి వీలుగా తాజాగా మద్యం ధరల్ని భారీగా పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పేదలు తాగే చీప్ లిక్కర్ నుంచి పెద్దోళ్లు తాగే ఖరీదైన మద్యం వరకూ కనీసం 10 శాతం నుంచి 30 శాతం వరకూ ధరల్ని పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఆలస్యం ఎందుకన్న చందంగా.. వెనువెంటనే పెరిగిన ధరల్ని అమల్లోకి తీసుకొచ్చేశారు. తాజాగా పెంచిన ధరల కారణంగా ప్రభుత్వానికి ఏడాదిలో రూ.4వేల కోట్ల మేర అదనపు ఆదాయం లభిస్తుందన్న అభిప్రాయం వ్యక్తవుతోంది. తాజా ఉత్తర్వుల ప్రకారం అన్ని రకాల బ్రాండ్లలో క్వార్టర్ బాటిల్ పై తక్కువ వేసుకుంటే రూ.20 వరకు ధర పెరగనుంది.

లైట్ బీరుకు సీసాకు రూ.20.. స్ట్రాంగ్ బీరుపై రూ.10చొప్పున పెంచేశారు. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఈ ఏడాది మద్యం అమ్మకాలు ఏకంగా రూ.20వేల కోట్లకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. తాజాగా పెంచిన మద్యం ధరలు చీఫ్ లిక్కర్ ను కూడా వదల్లేదు. పేదలు ఎక్కువగా వినియోగించే దీని మీదా ఏకంగా 30 శాతం ధరలు పెంచటం గమనార్హం.

ఏడాది మొత్తంలో అద్భుతమైన సీజన్ గా అభివర్ణించే కొత్త సంవత్సరం దగ్గరకు వస్తున్న వేళ.. ధరల్ని వెంటనే పెంచేస్తే.. ఆ ప్రయోజనం పొందొచ్చన్న ఉద్దేశంతోనే ధరల పెంపుపై అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి మద్యం ధరల పెంపునకు సంబంధించి మంత్రివర్గ ఉప సంఘాన్ని వేయాలని భావించారు. అలా చేస్తే ఆలస్యం కావటం.. న్యూఇయర్ సందర్భంగా జరిగే భారీ బిజినెస్ కారణంగా వచ్చే ఆదాయాన్ని కోల్పోవాల్సి ఉంటుంది.

అందుకే.. హడావుడిగా ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వేలాది కోట్ల ఆదాయం వస్తుంటే.. ఇప్పుడున్న లోటు వేళ ఏ ప్రభుత్వం మాత్రం పచ్చజెండా ఊపకుండా ఉంటుందా చెప్పండి? పెరిగిన ధరలు మందుబాబులకు కాస్త ఇబ్బంది కలిగించినా.. తమ పొదుపు మరింత తగ్గించుకొని మరీ ప్రభుత్వానికి కాసులు కురిపిస్తారని చెప్పక తప్పదు. ఈ ధరల పెంపు చాలా కుటుంబాల్లో కొత్త సమస్యల్ని తెచ్చి పెడుతుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News