కేసీఆర్ ఓకే చేసిన డిజైన్.. ఆ రెండింటిలా ఉందట!

Update: 2020-07-10 14:48 GMT
వాస్తు బాగోలేదని కూల్చేస్తున్నారన్నది విపక్షాల ఆరోపణ. వసతి లేకనే కూల్చేస్తున్నామంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వివరణ. ఏది ఏమైనా సీఎం కోరుకున్నట్లే.. సచివాలయాన్ని కూల్చేసేందుకు వీలుగా హైకోర్టు నిర్ణయం రావటం.. వెనువెంటనే కూల్చివేత పనులు మహా జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. కూల్చివేత పనులు షురూచేసిన తర్వాతి రోజునే.. కొత్తగా కట్టే సచివాలయానికి సంబంధించి.. కేసీఆర్ ఓకే చేసిన కొత్త డిజైన్ ను మీడియాకు విడుదల చేశారు.

చెన్నైకి చెందిన ఒక ప్రముఖ సంస్థ ఆర్నెల్లుగా కష్టపడి రూపొందించిన డిజైన్ కేసీఆర్ మనసును దోచినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఇప్పటికి ఓకే చేసిన డిజైన్ కు దగ్గరగా తెలంగాణలోని రెండు రాజభవనాలు ఉండటం ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 1871లో కాల్లాపూరర్ లో నిర్మించిన వెంకట లక్ష్మారావు రాజ ప్రసాదం మాదిరే కొత్త డిజైన్ ఉందన్న మాట వినిపిస్తోంది. జర్మనీకి చెందిన ఆర్కిటెక్చర్ తో భవన నిర్మాణాన్ని రూపొందించినట్లు చెబుతారు. అదే సమయంలో వనపర్తిలోని రాజభవనం మాదిరే నూతన సచివాలయ డిజైన్ ఉండటం ఆసక్తికరంగా మారింది.

ఈ రెండు రాజభవనాలు నేటికి చెక్కు చెదరకుండా నిలిచి ఉండటం విశేషం. కొల్లాపూర్ రాజభవనంలో రాణి మహల్.. చంద్రమహల్ ఇప్పటికి పలువురిని ఆకర్షిస్తుంటాయి. ఇక.. వనపర్తి రాజభవనంలో ప్రస్తుతం పాలిటెక్నిక్ కాలేజీని నిర్వహిస్తున్నారు. అప్పుడప్పుడు సినిమా షూటింగ్ లను నిర్వహిస్తుంటారు.ఈ రెండు ప్రాచీన రాజ భవనాలకు దగ్గరగా కొత్త సచివాలయ డిజైన్ ఉంది. మరీ.. విషయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలుసా? ప్రతి పనిలోనూ తన మార్కు పడాలన్న తపించే కేసీఆర్.. తెలంగాణలో ఇప్పటికే ఉన్న రాజభవనాలకు దగ్గరగా తాను కట్టించే సచివాలయ డిజైన్ ఉండటాన్ని ఒప్పుకుంటారా? అన్నదిప్పుడు ప్రశ్న.
Tags:    

Similar News