సామాన్యుడి సంగతి సరే..మధ్యతరగతి జీవి మాటేంటి?

Update: 2016-06-23 07:16 GMT
నిజంగానే మీడియా ఎంత ప్రభావం చూపించగలదు. ఒకే విషయాన్ని ఎన్ని కోణాల్లో ప్రజంట్ చేయగలదు. తమకు అనుకూల సర్కారు అధికారంలో ఉంటే ఒక విధంగా.. తమకు వ్యతిరేక సర్కారు ఉంటే మరోలా ఉండే మీడియా వాయిస్ ను చూస్తే విస్మయం చెందాల్సిందే. గతంలో పాటించిన ప్రమాణాలకు ఇప్పటికి ఏ మాత్రం పొంతన లేకుండా సాగిపోతున్న వారి తీరు చూస్తే.. మీడియాను ఎంతవరకు నమ్మాలన్నది ఇప్పుడు పెద్ద సందేహంగా మారటం ఖాయం.

తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ .. ఆర్టీసీ ఛార్జీలు పెంచాలని నిర్ణయించుకుందన్న విషయం తెలిసిందే. అధికారికంగా నిర్ణయం వెలువడనప్పటికీ.. ఛార్జీల పెంపు అనివార్యమని.. ఈ భారం ఏ రేంజ్లో ఉందన్నది ఈ రోజు అందరికి అర్థం కానుంది. విద్యుత్ ఛార్జీల పెంపు అన్న వెంటనే.. ప్రజల మీద ఎంత భారం అన్నది లెక్కలు కట్టి.. తాటికాయంత అక్షరాలతో విద్యుత్ మోత మోగనుందంటూ ఉదరగొట్టేసేవారు. తాజాగా కేసీఆర్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై ప్రముఖ మీడియా సంస్థలకు చెందిన దినపత్రికల్లో అచ్చేసిన విద్యుత్ ఛార్జీల పెంపు వార్తను ఒకసారి పరికిస్తే ఆశ్చర్యంతో నోట మాట రాదంతే.

వంద యూనిట్ల లోపు వినియోగించే వారికి ఎలాంటి భారం ఉండదని.. సామాన్యుడి మీద అధిక భారం వద్దంటూ ముఖ్యమంత్రి సూచించినవిషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించటం గమనార్హం. ఛార్జీల పెంపు అన్న పెద్ద హెడ్డింగ్ కిందనే.. ముఖ్యమంత్రి వారి పెద్ద మనసును ప్రత్యేకంగా కోట్ చేసిన సదరు దినపత్రికలు.. ఈసోరుమంటూ బతుకుబండి లాగే మధ్యతరగతి జీవి గురించి ప్రస్తావించటమే మానేసింది. నిజానికి దినపత్రికల్ని కొనేది సామాన్యుల కంటే దిగువ మధ్యతరగతి.. మధ్యతరగతి ఆపై వారే.

మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. కనీసం తన వినియోగదారులైన వారి ప్రస్తావన విద్యుత్ ఛార్జీల పెంపు వార్తలో లేకపోవటం ఏమిటన్నది పత్రికల్ని ప్రశ్నించేవారు ఎవరు..? రాష్ట్రం మొత్తమ్మీదా 86 లక్షల గృహవిద్యుత్ కనెక్షన్లు ఉంటే.. వాటిల్లో 60 లక్షల కనెక్షన్లు వినియోగం వంద యూనిట్ల లోపేనంటూ లెక్కలు చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఎప్పటిలా.. విద్యుత్ ఛార్జీలు పెంచిన వెంటనే మొత్తంగా ప్రభుత్వ వడ్డింపు కారణంగా డిస్కంలకు ఎంత ఆదాయం రానుంది? లాంటి విషయాల్ని ప్రస్తావించకపోవటం గమనార్హం. వంద యూనిట్ల లోపు వారికి ఎలాంటి భారం ఉండదంటున్నారే తప్పించి.. భారం పడే మొత్తం కనెక్షన్ల గురించి చెప్పకపోవటం చూసినప్పుడు.. మధ్యతరగతి జీవి గురించి మీడియాకు పట్టదా? అన్న భావన కలగటం ఖాయం.

విద్యుత్ ఛార్జీల పెంపు సామాన్యుడికి మినహాయింపు ఇవ్వటంతోనే సరిపోదు. వాణిజ్య సంస్థల మీద పడే భారం.. అంతిమంగా వినియోగదారుడి మీదనే పడుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. తన మీద పడిన ప్రతి రూపాయి భారానికి బదులుగా ఐదారు రూపాయిలకు కంటే ఎక్కువగా పిండే ప్రోగ్రాం పెట్టుకుంటారన్నది తెలిసిన సంగతే. ఈ లెక్కన చూసినప్పుడు పెరిగే విద్యుత్ ఛార్జీల కారణంగా వస్తు సేవల ఛార్జీలు పెరగనున్నాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. పెరగటం ఒక చోట మొదలైతే.. కార్చిచ్చు తరహాలో అన్ని రంగాలకు అది వ్యాపిస్తుందని.. మొత్తంగా అన్ని ధరలు పెరుగుతాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. కానీ..ఈ తిప్పల గురించి ప్రస్తావించేవారే కరువయ్యారే..?

Tags:    

Similar News