ఇప్పుడున్నట్లే ఉస్మానియాను కట్టేస్తారంట..?

Update: 2015-08-08 05:58 GMT
చారిత్రక ఉస్మానియా ఆసుపత్రిని కూల్చివేసి దాని స్థానంలో సరికొత్త భవనం నిర్మించే విషయంపై వివాదం చెలరేగటం తెలిసిందే. భవనం నిర్వహించటం ఏ మాత్రం  సరికాదన్న వాదనను తెలంగాణ ప్రభుత్వం వినిపిస్తుంటే.. మరోవైపు ప్రైవేటు నిపుణుల బృందం వాదన మరోలా ఉంది.

కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే  దశాబ్దాల పాటు ఉస్మానియా ఆసుపత్రిని కొనసాగించొచ్చని చెబుతుంటే.. ప్రభుత్వ వాదన మాత్రం వేరుగా ఉంది. పెచ్చులూడిపోవటాన్ని.. కూలిపోయే వరకూ తీసుకెళుతున్న భవనం.. ఏదైనా తేడా వస్తే ఎవరు బాధ్యత వహిస్తారని సూటిగా ప్రశ్నిస్తూ.. నోట మాట రాకుండా చేస్తోంది.

ప్రభుత్వ వాదనను బలపరుస్తూ.. మరో గొంతు ఉస్మానియా ఆసుపత్రిని కూల్చాలని వాదించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణ వైద్యుల సంఘం సైతం ఉస్మానియా వైద్యాలయాన్ని కూల్చేయాలని కోరుతోంది. చారిత్రక వైభవం ఉట్టిపడేలా ఉస్మానియా ఆసుపత్రి ఇప్పుడు ఎలా ఉందో అదే రీతిలో.. ప్రభుత్వం కొత్త భవనం నిర్మించి.. దాని వెనుక ట్విన్ టవర్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందంటూ ప్రభుత్వ వాదనను వినిపిస్తున్నారు.

శిథిలావస్థకు చెందిన పాత భవనం పురావస్తు శాఖ పరిధిలో ఉన్నందున దాన్ని కూల్చివేయకుండా అంతకంటే ఎత్తు అయిన భవనాలు నిర్మించేందుకు అనుమతి లభించటం కష్టమని చెబుతున్న సంఘం నేతల మాటలు వింటుంటే.. అచ్చం తెలంగాణ ప్రభుత్వ వాదనలానే ఉండటం గమనార్హం. ఆసక్తి రేకెత్తించే విషయం ఏమిటంటే.. కూల్చేయాలని భావిస్తున్న ఉస్మానియా ఆసుపత్రి మాదిరే.. మళ్లీ నిర్మిస్తామని.. దాని వెనుక రెండు ట్విన్ టవర్లు నిర్మిస్తామంటూ చెబుతున్న మాటలు చూస్తుంటే.. కొత్తగా కట్టిందేదీ.. పాత దాని స్థానంలో రీప్లేస్ కాదుగా. అయినా..ఈ ట్విన్ టవర్ల ఊరింపు దేనికన్నది సగటు తెలంగాణ జీవి ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News