ఉన్నోడికి అదే బాధ.. లేనోడికి అదే తిప్పలు

Update: 2016-06-04 06:27 GMT
రెండు తెలుగురాష్ట్రాల్లో చిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు.. వివిధ శాఖల కార్యాలయాల కోసం భవనాల వెతుకులాటలో బిజీగా ఉన్నారు. తెలంగాణతో పోలిస్తే ఏపీ పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పాలి. విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు అవసరమైన భవనాల్ని హైదరాబాద్ లో సర్దుబాటు చేయటం తెలిసిందే.

కాకుంటే.. హైదరాబాద్ లో పదేళ్లు ఉండే అవకాశం ఉన్నా ఏపీకి తరలివెళ్లాలన్నఆలోచనలో ఏపీ సర్కారు ఉండటం.. ఏపీ రాజధానిగా ఉన్న అమరావతిలో పూర్తి స్థాయి నిర్మాణాలు సిద్ధం కాని నేపథ్యంలో.. కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన భవనాల్ని సమకూర్చుకునేందుకు కసరత్తు చేస్తుంది. అయితే.. ఈ ప్రక్రియ కొన్ని నెలల నుంచి సాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే కొన్ని భవనాల్ని ఏపీ సర్కారు గుర్తించింది.

తాజాగా తెలంగాణ సర్కారుకు భవనాల కొరత వెంటాడుతుంది. అన్ని ఉన్న తెలంగాణకు భవనాల కొరత ఏమిటంటే.. అదంతా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫుణ్యమేనని చెప్పాలి. ఎందుకంటే వాస్తు సరిగా లేని (అధికారికంగా అయితే వసతులు సరిగా లేని) సచివాలయంలో ఉండటం కేసీఆర్ కు మా చెడ్డ చిరాకన్న విషయం తెలిసిందే. అందుకే ఆయన.. రూ.200 కోట్లు ఖర్చు పెట్టేసి కొత్త సచివాలయాన్ని నిర్మించాలన్న ఆలోచనలో ఉన్న విషయం తెలిసిందే.

చేతిలో ఎంత డబ్బున్నా.. కొన్ని అప్పటికప్పుడు ఏర్పాటు కావు కదా. వాటి కోసం కొంత టైం పడుతుంది. కొత్త సచివాలయ నిర్మాణానికి తక్కువలో తక్కువ ఏడాది నుంచి ఏడాదిన్నర సమయం పడుతుంది. ఆలోపు సర్దుబాటుకు వీలుగా భవనాలు అవసరం కానున్నాయి. ఇందులో భాగంగా కొత్త భవనాల ఎంపిక కోసం తెలంగాణ అధికారులు కసరత్తు మొదలెట్టారు. వివిధ శాఖలకు సంబంధించిన కార్యాలయాల్ని ఎక్కడో అక్కడ సర్దేయొచ్చు. కానీ.. మంత్రుల పేషీల్ని ఎక్కడ ఏర్పాటు చేయాలన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. తాత్కాలిక సర్దుబాటుకు అవసరమైన భవనాల్ని వెతికే పనిలో తెలంగాణ అధికారులు బిజీబిజీగా ఉన్నారు. మంత్రులుగా ఉన్న 17 మందికి వివిధ భవనాల్లో తాత్కాలిక కార్యాలయాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో  అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని చూస్తే అన్ని ఉన్న తెలంగాణకు కష్టాలే.. ఏమీ లేని ఏపీకి తిప్పలే అనిపించక మానదు. పాలకుల తీరుకు తగ్గట్లే పాలన ఉంటుంది మరి.
Tags:    

Similar News