ఎల‌క్ట్రిక్ బ‌స్సులు ఓకే.. మ‌రి దాని సంగ‌తేంది?

Update: 2018-02-14 05:20 GMT
ఇప్పుడు చెప్పే విష‌యం సులువుగా అర్థం కావ‌టానికి అంద‌రికి తెలిసిన ఒక ఉదాహ‌ర‌ణ‌తో స్టార్ట్ చేస్తాం. క‌రెంటు ఎప్పుడు వ‌స్తుందో.. ఎప్పుడో పోతుందోన‌న్న విష‌యం మీద క్లారిటీ లేని వేళ ఇన్వెర్ట‌ర్ల‌ను పెద్ద ఎత్తున ఇళ్ల‌ల్లో అమ‌ర్చుకోవ‌టం తెలిసిందే. ఈ ఇన్వెర్ట‌ర్లు పెట్టుకోవ‌టం బాగానే ఉన్నా.. దీని నిర్వ‌హ‌ణ మామూలుగా ఉండ‌దు. గ‌తంలో ప‌దివేలు కానీ.. ఇప్పుడైతే ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర ఒక మోస్త‌రు కుటుంబం ఇన్వెర్ట‌ర్ పెట్టుకోవాలంటే రూ.20వేల వ‌ర‌కూ ఖ‌ర్చు చేయాల్సిన ప‌రిస్థితి.

ఈ ఖ‌ర్చు ఇన్వెర్ట‌ర్ కొన‌టంతో మొద‌లై.. అలా కొన‌సాగుతుంది. ప్ర‌తి రెండేళ్ల‌కు.. లేదంటే మూడేళ్ల‌కు ఒక‌సారి బ్యాట‌రీ మార్చుకోవ‌టం త‌ప్ప‌నిస‌రి అన్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఇన్వెర్ట‌ర్ ఖ‌ర్చులో సింహ‌భాగం బ్యాట‌రీదేన‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఒక ఇంటి ఇన్వెర్ట‌ర్‌ కే ఇంత ఖ‌ర్చు ఉంటే.. కాలుష్యం లేకుండా ఉంటుంద‌న్న ఉద్దేశంతో ఈ మ‌ధ్య‌న అదే ప‌నిగా ప్ర‌చారం చేస్తున్న బ్యాట‌రీ బ‌స్సులు.. వాహ‌నాల విష‌యంలో మ‌రో కోణాన్ని ఎవ‌రూ ట‌చ్ చేయ‌టం లేదు. ఒక బ్యాట‌రీ వాహ‌నంలో కీల‌క‌మైన బ్యాట‌రీని ఎన్నేళ్ల‌కు ఒకసారి మార్చాల్సి ఉంటుంది?  దాని లైఫ్ ఎంత‌? ఒక‌సారి ఒక బ్యాట‌రీ లైఫ్ అయిపోతే.. దాన్ని డిస్పోజ్ చేసే క్ర‌మంలో ఎంత కాలుష్యం జ‌న‌రేట్ అవుతుంద‌న్న‌ది ప్ర‌శ్న‌.

కానీ.. ఈ విష‌యాల్ని క‌నీసం ప్ర‌స్తావించ‌కుండానే.. బ్యాట‌రీ వాహ‌నాల్ని అదే ప‌నిగా ప్ర‌మోట్ చేయ‌టం ఈ మ‌ధ్య‌న ఎక్కువ అవుతోంది. తాజాగా హైద‌రాబాద్ రోడ్ల మీద పెద్ద ఎత్తున ఎల‌క్ట్రిక్ బ‌స్సుల్ని న‌డ‌పాల‌ని ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇందుకు త‌గ్గ‌ట్లే కేంద్రం సైతం భారీ ఎత్తున‌ రాయితీని ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతోంది.

దేశంలోని ప‌లు రాష్ట్రాల‌కు ఎల‌క్ట్రిక్ బ‌స్సుల్ని రాయితీతో అందించే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ ఎల‌క్ట్రిక్ బ‌స్సు ఒక్కొక్క‌టి రూ.1.70కోట్ల నుంచి రూ.2.70 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని చెబుతున్నారు. ఇందులో కోటి రూపాయిల మేర కేంద్రం రాయితీ ఇవ్వ‌నున్న‌ట్లు చెబుతున్నారు.

ఇంత భారీ ఖ‌ర్చుకు కార‌ణం ఈ బ‌స్సులో ఉండే భారీ బ్యాట‌రీనేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఒక‌సారి బ్యాట‌రీ ఛార్జ్ చేస్తే 70 నుంచి 250 కిలోమీట‌ర్ల వ‌ర‌కూ న‌డిచే అవ‌కాశం ఉంది. ఈ మ‌ధ్య‌నే బ్యాట‌రీ బ‌స్సును హైద‌రాబాద్ రోడ్ల మీద ప్ర‌యోగాత్మ‌కంగా న‌డిపి చూశారు. తొలిద‌శ‌లో తెలంగాణ‌కు 40 బ‌స్సుల్ని.. త‌ర్వాతి ద‌శ‌లో 60 బ‌స్సుల్ని కేటాయించ‌నున్నారు. అద్దె ప్రాతిప‌దిక‌న ఈ బ‌స్సుల్ని తీసుకోవాల‌ని తెలంగాణ ఆర్టీసీ భావిస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల‌కు ఎల‌క్ట్రిక్ బ‌స్సుల్ని కేటాయిస్తోంది కేంద్రం. ఈ బ‌స్సుల్లో కీల‌క‌మైన బ్యాట‌రీల‌ను చైనా నుంచి దిగుమ‌తి చేసుకొన‌టం గ‌మ‌నార్హం. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో కాలుష్యాన్ని కంట్రోల్ చేసేందుకు 40 ఎల‌క్ట్రిక్ బ‌స్సుల్ని సిటీలోకి తెస్తున్న‌ట్లు చెబుతున్న ప్ర‌భుత్వాలు.. ఈ న‌ల‌భై బ‌స్సుల‌తోనే కాలుష్యం మొత్తం మాయ‌మ‌వుతుందా? అన్న‌ది ఒక సందేహ‌మైతే.. ఈ ఎల‌క్ట్రిక్ బ‌స్సుల్లోని బ్యాట‌రీ కార‌ణంగా ప‌ర్యావ‌ర‌ణానికి క‌లిగే న‌ష్ట‌మెంత అన్న దానిపై శాస్త్రీయ ప‌రిశోధ‌న జ‌ర‌పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News