షాకింగ్.. కూల్చివేతలో పాల్గొనే కూలీలకు అన్ని తనిఖీలా?

Update: 2020-07-10 09:10 GMT
తెలంగాణ సచివాలయాన్ని కూల్చేసే ఉదంతంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. భారీగా ఉన్న భవనాల్ని కూల్చేందుకు పెద్ద ఎత్తున కూలీల్ని వినియోగిస్తున్నారు. వీరికి తోడుగా యంత్ర పరికరాల సాయం తీసుకుంటున్నారు. అయితే.. పనికి వచ్చే కూలీలకు చేస్తున్న తనిఖీల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మొదటి రెండు రోజులతో పోలిస్తే.. మూడో రోజున పనుల్లో వేగం పెరిగినట్లుగా చెబుతున్నారు. సచివాలయాన్ని కూల్చేసే ప్రాంతానికి దగ్గర్లోకి కూడా సాధారణ ప్రజల్ని అనుమతించటం లేదు. కూల్చివేత ఎపిసోడ్ మొత్తం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.. రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డిలు ఇద్దరే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దీంతో.. కింది స్థాయి అధికారులు వారిద్దరి ఆదేశాల్ని మాత్రమేఅమలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

కూల్చివేత ప్రక్రియలో కీలకమైన కూలీల విషయంలో అధికారుల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారిని పూర్తిస్థాయిలో పరీక్షలు జరపటమే కాదు.. వారి దగ్గర ఉండే సెల్ ఫోన్లను తీసేసుకుంటున్నారు. పని నుంచి తిరిగి వెళ్లేటప్పుడు ఇస్తామని చెబుతున్నారు. తాము ఎన్నో చోట్ల పని చేశాం కానీ.. ఇలాంటి పరిమితుల్ని ఇప్పటివరకూ చూడలేదని కూలీలు వాపోతున్నారు.

ఇదిలా ఉంటే.. కూల్చివేత వద్ద విధులు నిర్వహించిన ఇద్దరు కానిస్టేబుళ్లు తెలీక తమ సెల్ ఫోన్లో ఫోటోలు తీసుకున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నతాధికారులు వారిపై చర్యలకు నడుం బిగించారు.వారిద్దరిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేయటం గమనార్హం.ఇక.. కూల్చివేతలో పాలు పంచుకునేందుు దాదాపు500 మంది కూలీల్ని వినియోగిస్తున్నారు. అదే సమయంలో సచివాలయం చుట్టుపక్కల 2వేల మంది పోలీసులు పహరా కాస్తుండటం గమనార్హం.

ఇప్పటివరకూ సాగిన కూల్చివేతలో సి బ్లాక్ కు కుడివైపున ఉన్న ఏ.. బీ బ్లాకుల భవనాల్ని పాక్షికంగా కూల్చేశారు. భవనాల ముందు ఉండే ఎలివేషన్ ను తొలగించారు. కే బ్లాక్ లోని పోస్టాఫీసును పూర్తిగా కూల్చేశారు. సీ..డీ.. జీ బ్లాకుల్ని కూల్చివేత పనులు నలభై.. యాభై శాతం మాత్రమే పూర్తి అయ్యాయి. ఇప్పటివరకూ ఎప్పుడూ లేని విధంగా.. చూడని రీతిలో కూల్చివేత కార్యక్రమం జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. 
Tags:    

Similar News