టీ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ‌!

Update: 2019-03-11 09:17 GMT
కాలం క‌లిసి రాన‌ప్పుడు.. సానుకూల ప‌రిణామాలు చోటు చేసుకోవ‌న్న‌ట్లుగానే ఉంది తెలంగాణ‌కాంగ్రెస్ ప‌రిస్థితి. అటు రాజ‌కీయంగా కావొచ్చు.. ఇటు కోర్టుల ప‌రంగా కావొచ్చు.. కాంగ్రెస్ కు వ‌రుస పెట్టి ఎదురుదెబ్బ‌లు త‌గులుతూనే ఉన్నాయి. తాజాగా అలాంటి ప‌రిస్థితే మ‌రొక‌టి ఎదురైంది.

గ‌డిచిన కొన్ని వారాల వ్య‌వ‌ధిలో ఐదుగురు తెలంగాణ కాంగ్రెస్ ప్ర‌జాప్ర‌తినిధులు పార్టీకి షాకిస్తూ.. గుడ్ బై చెప్పేసి గులాబీ కారు ఎక్కేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో అర్థ‌రాత్రి వేళ రేవంత్ ను అరెస్ట్ చేసిన వైనం పెను సంచ‌ల‌నంగా మారింది. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ స‌భ్యుడు వేం న‌రేంద‌ర్ రెడ్డి హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

ఈ మ‌ధ్య‌నే ఈ కేసు మీద విచార‌ణ జ‌రిపిన హైకోర్టు.. ఈ రోజుకు తీర్పు చెప్పేందుకు వాయిదా వేసింది. తాజాగా తీర్పు వెల్ల‌డించిన హైకోర్టు.. వేం న‌రేంద్ర‌రెడ్డి పిటిష‌న్ ను డిస్మిస్ చేస్తూ తీర్పు వెలువ‌రించింది. దీంతో.. రేవంత్ కు చుక్కెదురైన‌ట్లైంది. రేవంత్ రెడ్డి దాఖ‌లు చేసిన పిటిష‌న్ ను విచారించిన హైకోర్టు.. అరెస్టు అక్ర‌మం అన‌టానికి త‌గిన కార‌ణాలు చూప‌టంలో ఆయ‌న ఫెయిల్ అయిన‌ట్లుగా కోర్టు పేర్కొంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో డిసెంబ‌రు 4న కొడంగ‌ల్ లో సీఎం కేసీఆర్ ప్ర‌చార స‌భ జ‌ర‌గాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో సీఎం స‌భ‌ను అడ్డుకుంటామ‌ని.. ఆయ‌న్ను కొడంగ‌ల్ కు రానివ్వ‌మంటూ హెచ్చ‌రించారు. దీంతో.. ఆ రోజు అర్థ‌రాత్రి రేవంత్ ను ఆయ‌న ఇంట్లో అదుపులోకి తీసుకున్నారు.

రాత్రి వేళ‌లో రేవంత్ ను అదుపులోకి తీసుకున్న వైనంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. టీవీ ఛాన‌ళ్ల‌లోనూ.. వాట్సాప్ లోనూ దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఒక‌టి వైర‌ల్ అయ్యింది. ఈ అరెస్ట్ అక్ర‌మ‌మంటూ టీ కాంగ్రెస్ నేత వేం న‌రేంద్ర‌రెడ్డి హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై విచారించిన న్య‌యాస్థానం.. అరెస్ట్ అక్ర‌మం అంటూ రేవంత్ త‌ర‌ఫు స‌రైన వాద‌న వినిపించ‌లేద‌ని పేర్కొంటూ పిటిస‌న్ ను కొట్టి వేసింది. తాజా ప‌రిణామం రేవంత్ కు ఎదురుదెబ్బ‌గా ప‌లువురు అభివ‌ర్ణిస్తున్నారు.


Tags:    

Similar News