తెలంగాణ హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌.. కేసీఆర్‌ కు ఊర‌ట‌!

Update: 2019-05-17 05:26 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట‌లు వింటే భ‌లేగా ముచ్చ‌ట వేస్తుంది. ఇంత తెలివిగ‌ల సీఎం తెలుగు రాష్ట్రాల్లో ఒక‌డున్నాడ‌ని మురిసిపోతుంటారు. అదేం సిత్ర‌మో కానీ.. అలాంటి మేధావి ముఖ్య‌మంత్రి హోదాలో తీసుకునే చాలా నిర్ణ‌యాల‌కు సంబంధించి న్యాయ‌స్థానాలు మొట్టికాయ‌లు వేయ‌టం గ‌తంలో చూస్తున్న‌దే. మాట‌ల్లో చెప్పే విష‌యాలు చేత‌ల్లోకి వ‌చ్చేస‌రికి చోటు చేసుకునే మార్పుల‌తో పాటు.. షోరూం బ‌య‌ట 90శాతం వ‌ర‌కు డిస్కౌంట్ అని చెప్పి.. చిన్న చుక్క పెట్టి అప్ టూ అన్న రీతిలో సారు స‌ర్కారు నిర్ణ‌యాలు ఉంటాయ‌న్న విమ‌ర్శ ఉంది.

ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌భుత్వం తీసుకున్న ప‌లు నిర్ణ‌యాల మీద న్యాయ‌స్థానాల నుంచి ప‌లుమార్లు ఎదురుదెబ్బ‌లు తిన్న ఆయ‌న‌కు..ఈసారి మాత్రం అందుకు భిన్న‌మైన అనుభ‌వం ఎదురైంద‌ని చెప్పాలి. తాను న‌మ్మిన ప్రాజెక్టుల‌తో తెలంగాణ రూపురేఖ‌లు మార్చేస్తాన‌ని చెప్పే కేసీఆర్‌.. అందుకు త‌గ్గ‌ట్లే భారీ ఎత్తున ప్రాజెక్టులు నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.
ఇంత భారీ ప్రాజెక్టుల్ని నిర్మించే వేళ‌.. ఆ ప్రాజెక్టుల కార‌ణంగా ఎంతోకొంత మంది ప్ర‌భావితం కావ‌టం ఖాయం. అలాంటి వారికి ఇచ్చే ప‌రిహారం విష‌యంలో కేసీఆర్ ప్ర‌భుత్వం ఉదారంగా ఉంద‌నే చెప్పాలి. భూములు కోల్పోయే నిర్వాసితుల‌కు ఇచ్చే ప్యాకేజీ దేశంలోనే అత్యుత్త‌మంగా ఇస్తున్న‌ట్లు కేసీఆర్ స‌ర్కారు చెప్పుకుంటోంది.

ఇదిలా ఉంటే.. కోట్లాదిమందికి ప్ర‌యోజ‌నం క‌ల్పించే ప్రాజెక్టుల కోసం సేక‌రించే భూమి విష‌యంలో ప్ర‌భుత్వం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. త‌మ‌కు స‌రైన ప‌రిహారం ఇవ్వ‌లేద‌నో.. ప్ర‌జా ప్ర‌యోజ‌నాలు దెబ్బ తింటాయ‌న్న లిటిగెంట్ల‌తో కోర్టుల‌ను ఆశ్ర‌యించే వారు కొంద‌రుంటారు. మ‌రికొంద‌రు.. ధ‌ర్మంగానే త‌మ ఇబ్బందుల్ని చెప్పేందుకు కోర్టుల‌ను ఆశ్ర‌యిస్తుంటారు. అయితే.. అంద‌రికి వంద శాతం సంతృప్తి క‌లిగిస్తూ ప్రాజెక్టులు నిర్మించ‌టం సాధ్య‌మ‌య్యేది కాదు. భూమి కోల్పోతున్న త‌మ‌కు.. ఆ భూమితో త‌మ‌కున్న భావోద్వేగ సంబంధాన్ని తుంచుకోలేన‌ని.. చెప్పే వాద‌న వినేందుకు బాగానే ఉన్నా.. ప్రాక్టిక‌ల్ గా చూసిన‌ప్పుడు ఆ వాద‌న‌లో వ్య‌క్తిగ‌త స్వార్థం త‌ప్పించి.. ప్ర‌జా ప్ర‌యోజ‌నాలు క‌నిపించ‌వు. అలా అని.. కొన్ని ప్ర‌భుత్వాలు అదే ప‌నిగా.. ఇష్టారాజ్యంగా ప్రాజెక్టుల పేరుతో భూముల్ని సేక‌రించ‌టాన్ని మేమేమీ స‌మ‌ర్థించ‌టం లేద‌న్న‌ది ఇక్క‌డ స్ప‌ష్టం చేస్తున్నాం.

ఇదిలా ఉంటే.. ప్రాజెక్టుల‌కు సేక‌రిస్తున్న భూమికి స‌రిగా ప‌రిహారం ఇవ్వ‌టం లేద‌నో.. ఇత‌ర ప్ర‌యోజ‌నాల్ని క‌ల్పించ‌ట‌లేద‌న్న కార‌ణంగా ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మ‌య్యే సాగు..తాగునీరు అందించే ఇరిగేష‌న్ ప్రాజెక్టుల్ని ఆప‌టానికి వీల్లేద‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది. త‌మ‌కు ప‌రిహారం ఇవ్వ‌కుండా ప‌నులు చేస్తున్నార‌ని.. దీని కార‌ణంగా తాము జీవ‌నోపాధి కోల్పోయిన‌ట్లుగా పేర్కొంటూ ఏటిగ‌డ్డ కిష్టాపూర్ కు చెందిన ప‌లువురు రైతుకూలీలు దాఖ‌లు చేసిన కోర్టు ధిక్కర‌ణ పిటిష‌న్ ను విచారించిన తాత్కాలిక న్యాయ‌మూర్తి జ‌స్టిస్ రాఘ‌వేంద్ర‌సింగ్ చౌహాన్.. జ‌స్టిస్ ష‌మీమ్ అఖ్త‌ర్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం గురువారం విచార‌ణ జ‌రిపింది. ఈ సంద‌ర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్య‌లు కేసీఆర్ ఆత్మ‌విశ్వాసాన్ని మ‌రింత పెంచ‌ట‌మే కాదు.. తాను న‌మ్మిన ప్రాజెక్టుల్ని మ‌రింత వేగంగా పూర్తి చేసే మ‌నోధైర్యం హైకోర్టు చేసిన తాజా వ్యాఖ్య‌లు ఇస్తాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. కొన్ని అంశాల విష‌యంలో అదే ప‌నిగా ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్న కేసీఆర్ స‌ర్కారుకు.. హైకోర్టు తాజా వ్యాఖ్య‌లు ఫుల్ హ్యాపీగా మారుస్తాయ‌నటంలో సందేహం లేదు.
Tags:    

Similar News