రూపాయికే ఎకరం భూమా?

Update: 2019-10-01 11:30 GMT
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతికి తెలంగాణ సీఎం కేసీఆర్ సమర్పించుకున్న దక్షిణ విషయంలో హైకోర్టు నోటీసులిచ్చింది. హైదరాబాద్‌ నగర శివారులోని కోకాపేటలో విలువైన రెండు ఎకరాల భూమిని కేవలం రెండు రూపాయలకు.. అంటే ఎకరం రూపాయి చొప్పున కేటాయించడంపై హైకోర్టు నోటీసు ఇచ్చింది. దీనికి సంబందించి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలవడంతో ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ హైకోర్టు నోటీసు ఇచ్చింది.
   
రంగారెడ్డి జిల్లా కోకాపేట సర్వే నెంబర్‌ 240లో శారదా పీఠానికి భూమి కేటాయించడాన్నిసవాల్‌ చేస్తూ సికింద్రాబాద్‌ కు చెందిన వీరాచారి దాఖలు చేసిన పిల్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్ - న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని సీఎస్ - రంగారెడ్డి జిల్లా కలెక్టర్ - హెచ్‌ ఎండీఏ ఎండీ - శారదా పీఠం ధర్మాధికారి జి.కామేశ్వరశర్మలకు నోటీసులు జారీ చేసింది.
   
స్వరూపానంద ఆశ్రమానికి రెండు ఎకరాల కేటాయింపు వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదమవుతోంది. ప్రభుత్వానికి చెందిన భూములను ఎవరికైనా కేటాయించాలంటే అందుకు కారణాలు ఉండాలని - పరిశ్రమలు స్థాపించడానికో.. లేదంటే క్రీడాకారులెవరైనా అకాడమీలు ఏర్పాటు చేయడానికో.. లేదంటే ఇంకేదైనా ప్రయోజనకరమైన పనులకో ఇవ్వాలన్న నిబంధనలున్నాయని.. కానీ, అలాంటి కారణాలేమీ లేకుండా కేవలం తనతో యాగాలు చేయించారన్న కారణంతో స్వరూపానందుకు కారు చవగ్గా భూములిచ్చారని విమర్శలు వెల్లువెత్తాయి.
   
ఎన్నికలకు ముందు కేసీఆర్‌ తో స్వరూపానంద రాజశ్యామల యాగం చేయించారు. ఏపీ సీఎం జగన్‌ కోసం కూడా ఆయన పూజలు చేసినట్లు చెబుతారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు సీఎంలూ తరచూ ఆయనతో భేటీ అవుతున్నారని.. కేసీఆర్ ఏకంగా రెండు రూపాయలకే రెండెకరాల భూమిని కేటాయించారని విమర్శలున్నాయి. ఈ విషయం ఇప్పుడు కోర్టుకు చేరడంతో ఈ కేటాయింపు నిలబడుతుందా లేదా అన్నది చూడాలి.
Tags:    

Similar News