హైకోర్టు సంచలనం..ఇద్దరు కలెక్టర్లకు ఫైన్ - ఆర్డీఓకు జైలు

Update: 2020-01-29 16:07 GMT
నిజంగా ఈ వార్త సంచలనమనే చెప్పాలి. తెలంగాణలో కలెక్టర్లుగా పనిచేస్తున్న ఇద్దరు ఐఏఎస్ అధికారులతో పాటుగా రెవెన్యూ డివిజన్ కు బాస్ గా వ్యవహరిస్తున్న ఓ ఆర్డీఓపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. కలెక్టర్ స్థాయి అధికారలకు జరిమానాతో సరిపెట్టగా... ఆర్డీఓకు మాత్రం ఏకంగా రెండు నెలల జైలు శిక్షను ఖరారు చేయడంతో పాటుగా జరిమానా కూడా విధిస్తూ బుధవారం హైకోర్టు బుధవారం సంచలన తీర్పునిచ్చింది. అడ్మినిస్ట్రేటివ్ జ్యూడిషియల్ పవర్ కలిగిన కలెక్టర్లు - ఆర్డీఓకు జరిమానా - శిక్ష విధించడం తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది.

ఈ కేసు వివరాల్లోకి వెళితే... మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోర్టు దిక్కరణ కేసులో  హైకోర్టు ఈ శిక్షలు ఖరారు చేసింది. ఈ కేసులో సిద్దిపేట - సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లకు రూ.2 వేల జరిమానా విధించగా - సిద్దిపేట ఆర్డీఓ జయచందర్ రెడ్డికి రెండు నెలల జైలుశిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధించింది. 2018లో మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ విషయంలో రైతుల అభ్యంతరాలు వినకుండా డిక్లరేషన్, అవార్డు ఇచ్చారని కొందరు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దాంతో డిక్లరేషన్‌ ను, అవార్డును రద్దు చేస్తూ గతంలో హైకోర్టు ఆదేశాలిచ్చింది.

2019 మే నెలలో హైకోర్టు ఆదేశాలను పాటించకుండా మళ్ళీ డిక్లరేషన్ - అవార్డు ప్రకటించారని మరోసారి రైతులు కోర్టుకెక్కారు. రైతుల పిటిషన్‌ లను విచారించిన హైకోర్టు.. సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి - సిరిసిల్లా జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్‌ లకు రూ.2 వేల జరిమానా విధించింది. నాలుగు వారాల్లో జరిమానా మొత్తాన్ని చెల్లించకపోతే నెల రోజుల జైలుశిక్ష విధించాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను పాటింయకపోతే... ఎంతటివారైనా శిక్షకు గురి కాక తప్పదన్న రీతిలో హైకోర్టు వెలువరించిన ఈ తీర్పు సంచలనంగా మారింది.
Tags:    

Similar News