క‌రోనాపై హైకోర్టు సీరియ‌స్‌.. కేసీఆర్ స‌ర్కారుకు స్ట్రాంగ్ వార్నింగ్‌!!

Update: 2021-04-19 08:44 GMT
`మీకు ప‌బ్బులు, క్ల‌బ్బులు ముఖ్య‌మా?  ప్ర‌జారోగ్యం ముఖ్య‌మా?  మీరు చ‌ర్య‌లు తీసుకుంటారా?  లేదా?  లేక మ‌మ్మ‌ల్నే నిర్ణ‌యం తీసుకోమంటారా?``.. ఇదీ తాజాగా తెలంగాణ‌లోని కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని ఉద్దేశించి రాష్ట్ర హైకోర్టు చేసిన అత్యంత సీరియ‌స్ కామెంట్లు. అంతేకాదు. ఎన్న‌డూ హైకోర్టు హిస్ట‌రీలో లేని విధంగా ఒకే కేసును ఒకే రోజు రెండు ద‌ఫాలుగా విచారించ‌డంతోపాటు సంబంధిత అధికారులు వాయు వేగ మ‌నోవేగాల‌తో హైకోర్టుకు రావాల‌ని పేర్కొన‌డం కూడా సంచ‌ల‌నంగా మారింది. మ‌రి హైకోర్టు ఇంత సీరియ‌స్ అవ‌డానికి రీజ‌నేంటి?  ఎందుకు ఇంత హుటాహుటిన అధికారుల‌ను హైకోర్టుకు రావాల‌ని ఆదేశించింది? ఇదీ ఇప్పుడు తెలంగాణ‌లో సంచ‌ల‌నం రేపుతున్న విష‌యం.

రాష్ట్రంలో ముఖ్యంగా హైద‌రాబాద్‌లో క‌రోనా రెండో ద‌శ అత్యంత వేగంగా విస్త‌రిస్తోంది. ఈ క్ర‌మంలో కొన్నాళ్ల కింద‌ట రాష్ట్ర ప్ర‌భుత్వం స‌రిగా చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని.. క‌రోనా నియంత్ర‌ణ‌కు ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకునేలా ప్ర‌భుత్వాన్ని ఆదేశించాల‌ని కోరుతూ హైకోర్టులో ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లైంది. అప్ప‌ట్లోనే దీనిని విచారించిన హైకోర్టు.. ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటున్నారో చెప్పాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరింది. వెంట‌నే స్పందించిన ప్ర‌భుత్వం .. స్కూళ్లు కాలేజీలు మూసేశామ‌ని.. ప్ర‌జ‌ల‌ను చైత‌న్యం చేస్తున్నామ‌ని.. స‌మాధానం ఇచ్చింది.


అయితే.. ఈ చ‌ర్య‌లు చాల‌వ‌ని.. ఇంకా తీసుకోవాల‌ని.. పేర్కొంటూ.. ఓ ప‌ది రోజుల స‌మ‌యం ఇచ్చిన హైకోర్టు తాజాగా సోమ‌వారం ఈ పిటిష‌న్‌పై మ‌రోసారి విచార‌ణ చేప‌ట్టింది. ఈ సంద‌ర్భం గా ప్ర‌భుత్వం మ‌ళ్లీ పాత పాటే పాడింది. అదేస‌మ‌యంలో క‌రోనా టీకా ఇస్తున్నామ‌ని చెప్పింది. అయితే.. దీనిపై సంతృప్తి చెంద‌ని హైకోర్టు.. మాస్కులు ధ‌రించ‌ని వారిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని ప్ర‌శ్నించింది. దీనికి కూడా కేసులు న‌మోదు చేస్తున్నామ‌ని హోం శాఖ చెప్పింది. కేవ‌లం కేసులు న‌మోదు చేసి చేతులు దులుపుకొంటున్నారా? అని నిల‌దీసిన హైకోర్టు.. ప‌బ్బులు , మాల్స్‌, క్ల‌బ్బులు, హోట‌ళ్లు, రెస్టారెంట్లు, బార్లు తీసేఉంటున్నాయి క‌దా? అని ఎదురు ప్ర‌శ్నించింది.

భౌతిక దూరం పాటించాల‌ని ప్ర‌చారం చేస్తున్నామ‌ని.. ప్ర‌భుత్వ త‌రుఫ‌న అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ స‌మాధానం ఇచ్చారు. అయిన‌ప్ప‌టికీ.. హైకోర్టు సంతృప్తి వ్య‌క్తం చేయ‌లేదు. కరోనాను నియంత్రించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని కేసీఆర్ సర్కార్‌పై న్యాయస్థానం కన్నెర్రజేసింది. సినిమా హాల్‎లు, పబ్బులు, బార్లలో రద్దీని తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన నివేదికలో కనీస వివరాలు లేకపోవడంతో హైకోర్టు అక్షింతలు వేసింది. పబ్బులు, మద్యం దుకాణాలపై చర్యలు ఏమయ్యాయి..?  మీకు ఆదాయమే ముఖ్యమా..? అని సూటిగా ప్రశ్నించింది.

జిల్లాల‌ అధికారులు ఇచ్చే కరోనా కేసుల రిపోర్టులకు, ప్రభుత్వం ఇచ్చే పూర్తి రిపోర్టులకు చాలా వ్యత్యాసం ఉందంటూ కేసీఆర్ సర్కార్‌పై కోర్టు కన్నెర్రజేసింది. ‘ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కరోనా టెస్టులు ఎందుకు చేయట్లేదు..? ప్రజల ప్రాణాలు గాల్లో తేలాడుతుంటే ఇంకెప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు..? అసలు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందా? లేదా ఆదేశాలు ఇవ్వమంటరా..?’ అంటూ హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. ఇవాళ మధ్యాహ్నం వరకు అసలు ఏమేం చర్యలు తీసుకుంటారో..? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో మొత్తం నివేదించాలని.. అంతేకాకుండా విచారణకు సంబంధిత అధికారులు కూడా హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. మొత్తానికి కేసీఆర్‌కు హైకోర్టు త‌లంట‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News