జగన్ అక్రమాస్తుల కేసులో టీహైకోర్టు తీసుకున్న తాజా నిర్ణయం ఇదే

Update: 2022-09-09 04:47 GMT
ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గతంలో నమోదైన సీబీఐ.. ఈడీ కేసుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాల్నిజారీ చేసింది. అక్రమాస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో తొలుత సీబీఐ ఛార్జిషీట్లపై విచారణ చేపట్టాలని ఆదేశాల్ని జారీ చేసింది. జగన్ మీద సీబీఐతో పాటు ఈడీ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

ఈ రెండింటిలో తొలుత వేటి విచారణ చేయాలన్న దానిపై తెలంగాణ హైకోర్టుక్లారిటీ ఇచ్చింది. తొలుత సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ల సంగతి తేల్చాలని.. వాటిపై తీరపు వెల్లడైన తర్వాత ఈడీ కేసుల విచారణ చేపట్టాలని పేర్కొంది. ఒకవేళ రెండూ ఛార్జిషీట్లపై విచారణ సమాంతరంగా నిర్వహించినప్పటికీ సీబీఐ కేసులు తేలే వరకు ఈడీ కేసులపై తీర్పు వెలువరించకూడదన్న విషయాన్ని హైకోర్టు స్పష్టం చేసింది.

దీంతో.. సీబీఐ చార్జిషీట్లపై విచారణను వేగవంతం చేస్తారు. సీబీఐ.. ఈడీలు నమోదు చేసిన కేసులు వేర్వేరుగా పేర్కొంటూ ఒక దానితో మరొకటి సంబంధం లేకుండా విచారణ చేపట్టవచ్చంటూ గతంలో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేయటమే కాదు కీలక వ్యాఖ్య చేసింది.

ఒకవేళ సీబీఐ కేసులు కానీ వీగిపోతే.. ఇక ఈడీ కేసులే ఉండవన్న విషయాన్ని హైకోర్టు పేర్కొంది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ పదకొండు ఛార్జిషీట్లు..ఈడీ 9 ఛార్జిషీట్లు దాఖలు చేసి కోర్టుల్లో విచారణ చేపట్టటం తెలిసిందే.

సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసులపై విచారణ ప్రారంభించాలని గతంలో సీబీఐ న్యాయస్థానాన్ని ఈడీ కోరగా.. అందుకు సానుకూలంగా స్పందించింది. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసుల విచారణ చేపట్టాలని డిసైడ్ చేసింది. అయితే.. సీబీఐ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల్ని సవాలు చేస్తూ విజయసాయి రెడ్డి.. జగతి పబ్లికేషన్స్.. భారతీ సిమెంట్స్ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి.

వీటిపై వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ గురువారం కీలక తీర్పును వెలువరించారు. ఈ ఇష్యూలో సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టత ఇచ్చిందని పేర్కొన్నారు. ఒకవేళ సీబీఐ కేసులు కొట్టి వేస్తే.. నేరపూరిత సొమ్ము ఉందనే అంశమే ఉండదని చెబుతూ సీబీఐ కోర్టు తీర్పును కొట్టేసింది. సో.. సీబీఐ కేసుల లెక్క తేలితే.. ఈడీ కేసుల తదుపరి లెక్క ఏమిటన్న విషయంపై స్పష్టత రానుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News