జ‌గ‌న్ కేసుల‌పై హ‌రిరామ జోగయ్యకు హైకోర్టు వాయింపు!

Update: 2023-06-12 16:03 GMT
జనసేన అధినేత పవన్ కు నిత్యం రాజకీయంగా సలహాలిస్తూ, సూచనలు చేస్తూ, అప్పుడప్పుడూ హెచ్చరికలు చేస్తూ కాలక్షేపం చేస్తుంటారు హరిరామ జోగయ్య! టీడీపీతో పొత్తు పెట్టుకుంటే... అధికారంలోకి వచ్చిన అనంతరం రెండున్నరేళ్లు పవన్ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటుంటారు. ఇదే క్రమంలో, అడిగిన అడగకపోయినా పవన్ కు ఏదోరకంగా సహకారం అందించాలని తపిస్తుంటారు. అందులో భాగంగానో ఏమో తెలియదు కానీ... తాజాగా 2024 ఎన్నికల నాటికి జగన్ పై ఉన్న కేసులను విచారించి తీర్పు ఇవ్వాలని కోరుతున్నారు జోగయ్య!  

అవును... మాజీ ఎంపీ చేగొండి హ‌రిరామ‌జోగ‌య్య ఉన్నట్లుండి జ‌గ‌న్ కేసుల‌పై న్యాయ‌పోరాటం చేసేందుకు ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసును వీలైనంత తొందరగా విచారించాలంటూ తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు! ఈ సందర్భంగా హరిరామజోగయ్య పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది! మీరు దాఖలు చేసిన పిల్ లో "పబ్లిక్‌ ఇంట్రస్ట్‌" ఏముందని ప్రశ్నించింది. వ్యక్తిగత కక్షతోనే ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసినట్లు కనిపిస్తోందని పేర్కొంది.

జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి విచారణ వేగవంతం చేయడంతోపాటు 2024 సాధారణ ఎన్నికలకు ముందే తీర్పు వెలువరించాలని, ఆ మేరకు సీబీఐ కోర్టుకు ఆదేశించాలని జోగయ్య పిటిషన్ వేశారు. ఈ పిల్‌ పై అభ్యంతరం లేవనెత్తిన రిజిస్ట్రీ.. కేసు నెంబర్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఫైలింగ్‌ నెంబర్ పైనే విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలకు సిద్ధం కాగా ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా జోగయ్య పై న్యాయస్థానం మరింత సీరియస్ గా స్పందించింది. "ఒక బాధ్యత గల మాజీ పార్లమెంట్‌ సభ్యుడైన మీరు ఇలా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదు. మీరు దాఖలు చేసిన పిటిషన్‌ లో అసలు ఎక్కడన్నా ప్రజాసక్తి ఉంది అని మీకన్నా అనిపిస్తోందా? వ్యవగత ద్వేషంతో కోర్టులను ఆశ్రయించి.. మా విలువైన సమయాన్ని వృథా చేయవద్దు" అని సూచించింది.

ఇదే సమయంలో మరింతగా వ్యాఖ్యానించిన న్యాయస్థానం... "సీఎం వైఎస్‌ జగన్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసుల విచారణ త్వరగా పూర్తి  చేసేలా చూడాలని పిటిషన్ వేశారు. రాష్ట్రపతి లేఖ రాశాం.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాం.. అని అంటారా? ఇది ఏం పద్ధతి? ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి చెప్పినంత మాత్రాన కింది స్థాయి కోర్టు భయపడి పనిచేయవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి" అని హెచ్చరించినంత పనిచేసింది!

అనంతరం రిజిస్ట్రీ అభ్యంతరం లేవనెత్తిన అంశాల కాపీని పిటిషనర్‌ కు ఇవ్వాలని ఆదేశిస్తూ.. విచారణను జూలై 6కు వాయిదా వేసింది ధర్మాసనం.

Similar News