హైకోర్టు కీలక వ్యాఖ్య.. లాయర్లు బయటకు రావాల్సిన అవసరమేముంది?

Update: 2021-05-28 11:30 GMT
వైరస్ వ్యాప్తికి చెక్ పెట్టేందుకు వీలుగా పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ను అమలు చేయటం తెలిసిందే. అందరూ అనుకుంటున్నట్లుగానే లాక్ డౌన్ అమలు మొదలైన పది రోజుల తర్వాత నుంచి కేసుల వ్యాప్తిలో వేగం తగ్గటమే కాదు.. కేసుల నమోదు సైతం తగ్గింది. ఇలాంటివేళ.. లాక్ డౌన్ నుంచి న్యాయవాదులకు మినహాయింపు ఇవ్వాలంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

జయంత్ జైసూర్య అనే లాయర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది విష్ణువర్దన్ రెడ్డి తన వాదనలు వినిపించారు. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ న్యాయవాదులకు లాక్ డౌన్ మినహాయింపులు ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన తెలంగాణ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్య చేసింది.

అన్నీ ఆన్ లైన్ లో విచారణ సాగుతున్నప్పుడు.. లాయర్లు బయటకు రావాల్సిన అవసరం ఏముంది? అంటూ ఆసక్తికర ప్రశ్నను సంధించింది. వారి ప్రాణాల్ని తాము ప్రమాదంలోకి నెట్టలేమని చెప్పిన హైకోర్టు.. లాక్ డౌన్ నుంచి లాయర్లకు మినహాయింపు ఇవ్వాలని ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఆదేవాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది.

లాయర్లకు మినహాయింపుపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని.. ఒకవేళ ప్రభుత్వం ఈ నెల 30న నిర్ణయం తీసుకోకుంటే.. ఈ అంశంపై మే 31న తాము విచారణ చేపడతామని పేర్కొంది.నిజమే.. ఆన్ లైన్ లో వాదనలు వినిపిస్తూ.. ప్రొఫెషనల్ గా ఎలాంటి ఇబ్బంది లేనప్పుడు.. వారికి లాక్ డౌన్ మినహాయింపులు ఇవ్వాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News