కేటీఆర్ టాక్స్ : డ‌బుల్ ఇంజిన్ మోడ‌ల్ ఎందుకు ? ఎవ‌రికి ?

Update: 2022-04-23 05:09 GMT
ఏదో పెద్దాయ‌న ఓ చిన్న త‌ప్పు చేస్తే చిన్న వాడు అయిన క‌ల్వ‌కుంట్ల వంశాకురం తార‌క రామారావు ఎందుక‌ని కోపం అవుతున్నారు. ఏదో పెద్దాయ‌న వ‌య‌స్సులోనూ మ‌రియు రాజ‌కీయ అనుభ‌వం లోనూ మ‌రియు ప‌రిణితిలోనూ క‌నుక అలా చూసి ఇలా వ‌దిలేయాలి.. కానీ చిన్నాడ‌యిన కేటీఆర్ ఎందుక‌ని ఫైర్ అవుతున్నారు.

కేసీఆర్ క‌న్నా కేటీఆరే ఎక్కువ‌గా ఆవేశ ప‌డుతున్నారు. ఆ మాత్రం ఉండాలి.. యువ ర‌క్తం లేదా ఊళ్ల‌ల్లో చెప్పుకునే విధంగా ఉడుకుర‌క్తం క‌నుక ! గ‌మ‌నించాలి ఇది ఉడుకుమోతు త‌నం అయితే కాదు. అది వేరు దానిని ఓర్వ‌లేని త‌నం అని రాయాలి. భాష‌కు ఉన్న ప‌రిమితుల‌ను దృష్టిలో ఉంచుకుంటూ రాజ‌కీయ శ‌క్తుల విస్తారం గురించి, ప‌నితనం గురించి రాయాలి. ఆ విధంగా కేటీఆర్ మాత్రం ఎందుక‌నో చాలా అంటే చాలా కోపం అయ్యారు, అవుతున్నారు కూడా !

ఓ ప్ర‌ధాన మీడియాతో మాట్లాడుతూ అచ్చం జిగ్నేశ్ మేవాణీ అనే ద‌ళిత నాయ‌కుడ్ని ఇమిటేట్  చేశారు. అనుక‌రించారు. న‌న్ను అరెస్టు చేస్తారా చేయండి అని స‌వాల్ విసిరారు. కానీ ఎందుక‌నో బీజేపీ పెద్ద‌లు ఈ స‌వాలును స్వీక‌రించలేదు. ఆవిధంగా చిన్నాడ‌యిన కేటీఆర్ ను తాము పెద్దాడ్ని చేయ‌ద‌లుచుకోలేదు అని బీజేపీ నాయ‌కులు ప్ర‌యివేటు సంభాష‌ణ‌ల్లో వ్యాఖ్యానిస్తున్నారు.

క‌నుక దేశాన్ని న‌డిపే ప్ర‌ధాని త‌ప్పులు చేయొచ్చు..దేశంలోనే అతి పెద్ద ధ‌నిక రాష్ట్రం అని తరుచూ చెప్పుకునే తెలంగాణ రాష్ట్రాన్ని నడిపే  రాజ‌కీయ‌శక్తి అయిన కేసీఆర్ కూడా త‌ప్పులు చేయ‌వ‌చ్చు. త‌ప్పులు చేయ‌డం క‌న్నా దిద్దుకోవ‌డంలోనే మిక్కిలి శ్ర‌ద్ధ ఉంటే మేలు.. ఆవిధంగా కేటీఆర్ కూడా త‌ప్పులు ప‌ల‌క‌కూడ‌దు.. గుజ‌రాత్ ను చూసి మాట్లాడ‌డం అయితే బాగుంది కానీ  త‌ప్పులు  అన‌గా బూతులు తిట్ట‌కూడ‌దు.

ఇక డ‌బుల్ ఇంజ‌న్ మోడ‌ల్ ఇదేనా అంటూ బ్రిట‌న్ ప్ర‌ధాని  బోరిస్ జాన్సన్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో గుజరాత్ దారుల వెంట ఇరు వైపులా ప‌ర‌దాలు క‌ట్ట‌డం పై కేటీఆర్ సీరియ‌స్ అయి ఇదేనా డ‌బుల్ ఇంజిన్ మోడ‌ల్ అంటే అని ఫైర్ అయ్యారు. ఇక్క‌డి వ‌ర‌కూ బాగుంది కానీ ఇదే అదునుగా దేశ ప్ర‌ధానిని మ‌రో మారు బూతులు మాత్రం ప‌రోక్షంగా కూడా తిట్ట‌వ‌ద్దు అని బీజేపీ సూచ‌న‌లు చేస్తోంది.

ఓ విధంగా రాష్ట్రంలో బీజేపీ కి అనుబంధంగానే నిన్న‌టి వ‌ర‌కూ తెలంగాణ రాష్ట్ర స‌మితి ప‌నిచేసింది. అంటే ఇక్క‌డ కూడా డ‌బుల్ ఇంజిన్ మోడ‌ల్ న‌డిచింది క‌దా! అంటే త‌ప్పిదాల్లో ఇరు పార్టీలకూ వాటా ఉంద‌ని తేలిపోయింది.  క‌నుక రాష్ట్రంలోనూ మ‌రియు కేంద్రంలోనూ ఒకే  పార్టీకి చెందిన స‌ర్కారు న‌డిస్తే దానిని డ‌బుల్ ఇంజిన్ స‌ర్కారు అని వ్య‌వ‌హ‌రించి వారి త‌ప్పులూ మ‌రియు ఒప్పులూ మాట్లాడుకోవ‌డం అన్న‌ది ఇప్ప‌టి విధి.ఈ ప‌ని తెలంగాణ రాష్ట్ర స‌మితి కానీ లేదా బీజేపీ కానీ చేస్తే మేలు.
Tags:    

Similar News